98 వేలు!

ABN , First Publish Date - 2020-09-18T07:48:13+05:30 IST

దేశంలో మరోసారి కరోనా అత్యధిక కేసులు నమోదయ్యాయి...

98 వేలు!

  • మరోసారి కరోనా అత్యధిక కేసులు
  • వైర్‌సతో తాజాగా 1,132 మంది మృతి
  • ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: దేశంలో మరోసారి కరోనా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో రెండోసారి 97 వేలపైగా పాజిటివ్‌లు వచ్చాయి. గురువారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 97,894 మంది వైర్‌సకు గురయ్యారని, మరో 1,132 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ నెలలో ఇప్పటివరకు 9 సార్లు 90 వేల పైగా కేసులు రావడం గమనార్హం. కొత్తగా 82 వేల మంది కోలుకున్నారని.. మొత్తం రికవరీలు 40.25 లక్షలకు చేరాయని కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసులు 10 లక్షలున్నట్లు వివరించింది. గత 10 రోజుల్లో 8 రోజులు 1,100 పైగా మరణాలు సంభవించడం గమనార్హం. కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నుంచి గురువారం డిశ్చార్జయ్యారు. ఆగస్టు 2వ తేదీన కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆయన కోలుకున్నారు. తర్వాత ఎయిమ్స్‌లో చేరి చికిత్స అనంతరం ఇంటికి చేరారు. అయితే, శ్వాస సమస్యలతో ఆదివారం రాత్రి మరోసారి ఎయిమ్స్‌లో చేరారు. కాగా, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌కు వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటివరకు  కొవిడ్‌ నిర్ధారణ అయిన కేంద్ర మంత్రుల సంఖ్య 9కి చేరింది. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం పరీక్షలు చేయించుకున్నారు.  


వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పటివరకు ప్రజలు జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు. గురువారం రాజ్య సభలో కరోనాపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.   రాయబార కార్యాలయాల నుంచి అందిన సమాచారం మేరకు విదేశాల్లోని 11,600 మంది భారతీయులు వైర్‌సకు గురైనట్లు తెలుస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు వివరించింది. ప్రస్తుతం 1.6గా ఉన్న మరణాల రేటును 1 శాతం లోపునకు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-18T07:48:13+05:30 IST