దేశమే ముఖ్యం.. వైద్యసేవలో ఎనిమిది నెలల గర్భిణి..
ABN , First Publish Date - 2020-04-21T16:24:06+05:30 IST
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితిలో వైద్యరంగంలో ఉన్నవారు ముందు వరుసలో నిలుచొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా..

కొండగావ్: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితిలో వైద్యరంగంలో ఉన్నవారు ముందు వరుసలో నిలుచొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. ఆ మహమ్మారితో పోరాడుతున్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణంపోయే అవకాశం ఉన్నా.. ఇతరులను కాపాడటం కోసం కష్టపడుతున్నారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఓ వైద్యురాలు, ఎనిమిది నెలల గర్భిణి.. తన కోసం.. తన బిడ్డ కోసం ఆలోచిస్తూ ఇంట్లో కూర్చోలేదు. తనకు దేశసేవే ముఖ్యమని భావించిన ఆమె.. రోగులకు వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని కొండవావ్ జిల్లా కేరావహి గ్రామానికి చెందిన సంతోషి మానిక్‌పూరి ఎనిమిది నెలల గర్భంతో రోగులకు వైద్యం అందిస్తోంది.
‘‘ప్రజలకు సేవ చేయడం నాకు సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నేను సేవ చేయడం నాకు గర్వకారణం. నాకు నా కుటుంబం, భర్త ఎంతో మద్దతు ఇచ్చారు’’ అని సంతోషి తెలిపింది. అయితే సంతోషి తన వృత్తి పట్ల చూపిస్తున్న అంకితభావం, ధైర్యానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె ఎందరికో ఆదర్శమని అంతా అంటున్నారు.