భారత్‌ @ 84

ABN , First Publish Date - 2020-03-15T08:34:37+05:30 IST

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.

భారత్‌ @ 84

  • పెరుగుతున్న కరోనా కేసులు.. మహమ్మారికి దేశంలో మరో మృతి?
  • పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు 
  • థియేటర్లు, మాల్స్‌ మూసివేత

న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. శనివారానికి 84 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది. దేశంలో సమూహ వ్యాప్తి దశకు వైరస్‌ చేరుకోలేదని, ఆరోగ్య అత్యయిక పరిస్థితేమీ లేదని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు, రాజస్థాన్‌, ఢిల్లీలో ఒక్కరు చొప్పున పాజిటివ్‌గా తేలినవారిని చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపింది. ఇక వైరస్‌ సోకిన 84 మందితో కలిసి తిరిగిన 4,000 మందిని పరిశీలనలో ఉంచినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌లో ఉన్న భారతీయ ప్రయాణికులను తీసుకొచ్చేందుకు పంపిన విమానం శనివారం అర్ధరాత్రికి వస్తుందని అధికారులు చెప్పారు. ఇటలీలోని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఓ విమానాన్ని ఇటలీ పంపినట్లు వెల్లడించారు. ఇటలీలోని విమానాశ్రయాల్లో 300 మందికి పైగా భారతీయులు చిక్కుకున్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, మయన్మార్‌ మొదలైన పొరుగుదేశాలకు భూ సరిహద్దుల ద్వారా ప్రయాణ రాకపోకలను 15వ తేదీ అర్థరాత్రి నుంచి భారత్‌ నిలిపివేస్తోంది. పాకిస్థాన్‌కు మాత్రం 16వ తేదీ అర్థరాత్రి నుంచి సస్పెండ్‌ చేస్తున్నారు. అయితే కొన్ని నిర్దిష్ట చెక్‌పోస్టుల నుంచి మాత్రం అనుమతిస్తారని హోంశాఖ తెలిపింది. ఇమ్మిగ్రేషన్‌ ల్యాండ్‌ పాయింట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. దౌత్య సిబ్బంది, ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్‌ అధికారులకు మాత్రం అత్తారి సరిహద్దుల ద్వారా అనుమతిస్తారు. 


ఇళ్లకు నలుగురు అనుమానితులు.. 

కరోనా లక్షణాలున్న నలుగురు అనుమానితులను నాగ్‌పూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఉంచారు. ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వీరికి చేసిన వైరస్‌ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వీరంతా ఆస్పత్రి సిబ్బంది వారిస్తున్నా వినకుండా ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే శనివారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. జమ్ముకశ్మీరులోని పూంఛ్‌ జిల్లాలో నలుగురు అనుమానితులను ఇళ్లలోనే క్వారంటైన్‌ చేశారు. కోల్‌కతాలో పెరూ దేశస్థుడు సహా నలుగురికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీరిలో కువైత్‌ నుంచి వచ్చిన 9 నెలల చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఐసోలేషన్‌ వార్డు నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకెళ్లిన అమెరికా జంటను శనివారం కోచిలో గుర్తించారు. వారిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు అధికారులు తెలిపారు. జర్మనీ నుంచి తిరువనంతపురం చేరుకున్న 56ఏళ్ల హరియాణా వాసిని శనివారం ఐసోలేషన్‌ వార్డులో ఉంచగా కొద్దిసేపటికే అతను వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. అటు మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో కరోనా అనుమానితుడు మృతి చెందాడు. సౌదీ నుంచి వచ్చిన 71 ఏళ్ల వృద్ధుడు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని వైద్యాధికారులు తెలిపారు. కాగా.. దక్షిణాసియాలో వైర్‌సను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదివా రం మోదీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సార్క్‌ సదస్సు జరగనుంది.


పార్లమెంటు ఆవరణలోకి నో ఎంట్రీ!

కరోనా నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఇచ్చే పబ్లిక్‌ గ్యాలరీ పాస్‌లు, పార్లమెంటు హౌస్‌ సందర్శన పాసులను రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. బెంగాల్‌ అసెంబ్లీలోకి జర్నలిస్టులు, సందర్శకులను కూడా పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. భూటాన్‌తో సరిహద్దును మూసివేసినట్లు మమత సర్కారు ప్రకటించింది.


విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌ మూసివేత

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా థియేటర్లు, మాల్స్‌ కూడా మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. తెలంగాణలో ఈనెల 31 వరకు విద్యా సంస్థలు, సినిమా థియేటర్లను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ నగరమైన బెంగళూరులో శనివారం మాల్స్‌, థియేటర్లు, పబ్‌లు, నైట్‌ క్లబ్బులను మూసివేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు నిర్మానుష్యంగా కనిపించాయి. వారం పాటు అన్ని ఎగ్జిబిషన్లు, వేసవి శిబిరాలు, సదస్సులు, పెళ్లిళ్లు, క్రీడలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వ ఆదేశించింది. రాజస్థాన్‌లో ఈ నెల 30 వరకు, పంజాబ్‌లో ఈ నెల 31 వరకు అన్ని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కేరళ, మహారాష్ట్రల్లో విద్యాసంస్థలు, మాల్స్‌, జిమ్‌లు, బీచ్‌ల్లో నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. 


దేశంలోని కరోనా కేసుల్లో..

విదేశీయులు 17

భారతీయులు 67


మొత్తం మరణాలు   2

కర్ణాటక-1.. ఢిల్లీ-1

Updated Date - 2020-03-15T08:34:37+05:30 IST