ఒక్కరోజే 81 కొత్త కేసులు... మొత్తం 396

ABN , First Publish Date - 2020-03-23T14:43:51+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కేసులు 396కు చేరుకున్నాయి. ఒక్క ఆదివారంనాడే వివిధ రాష్ట్రాల్లో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ చెలరేగినప్పటి ..

ఒక్కరోజే 81 కొత్త కేసులు... మొత్తం 396

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు 396కు చేరుకున్నాయి. ఒక్క ఆదివారంనాడే వివిధ రాష్ట్రాల్లో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ చెలరేగినప్పటి నుంచి ఒక్కరోజులో ఇన్ని కొత్త కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ముంబై, పాట్నా, సూరత్‌లతో ఒక్కొక్కరు చొప్పున ఆదివారం మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఏడుగురు చేరింది.


గత మూడు రోజులుగా కరోనా వైరస్ కేసులు ఊపందుకోవడంతో చైనా, ఇటలీ తరహాలో పరిస్థితి చేయి దాటిపోకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కరోనా బారిన పడిన 75 జిల్లాలను పూర్తిగా లాక్‌డౌన్ చేయాలని కేంద్రం అడ్వయిజరీ జారీ చేసింది. సోమవారం నుంచి 31వ తేదీ వరకూ అన్ని రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.


ఢిల్లీ లాక్‌డౌన్

దేశ రాజధానిని ఈనెల 23 నుంచి 31 వరకూ పూర్తిగా లాక్‌డౌన్ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో అన్ని ఢిల్లీ సరిహద్దులను మూసేస్తున్నామని, అయితే సరిహద్దు రాష్ట్రాల నుంచి కూరగాయలు, పాలు వంటి నిత్యావరసర వస్తువుల రాకను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఈ లాక్‍డౌన్ కొనసాగనుంది.


మిగతా రాష్ట్రాల్లోనూ...

పంజాబ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ ప్రకటించాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర సిటీల్లో బుధవారం వరకూ లాక్‌డౌన్ ప్రకటించారు. ఉ్తతరప్రదేశ్‌లోని 15 జిల్లాలు లాక్‌డౌన్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో కూరగాయలు, పాల ఉత్పత్తులు, మెడికల్ షాపులను మాత్రమే అనుమతిస్తారు.

Updated Date - 2020-03-23T14:43:51+05:30 IST