జుగాడ్‌పై 1,200 కిలోమీటర్లు.. కూలీల అవస్థలు

ABN , First Publish Date - 2020-03-28T00:51:54+05:30 IST

ఢిల్లీలో పని చేస్తున్న బిహారీలు లాలూ మట్హో, గోరె లాల్ మట్హోతో పాటు వీరి కుటుంబ సభ్యుడు మరొక వ్యక్తి స్కూటర్ ఇంజిన్‌ను జుగాడ్‌(రిక్షా)కు అమర్చుకొని సొంతింటికి ప్రయాణం ప్రారంభించారు. మొత్తం వారి ప్రయాణ దూరం 1,200 కిలో మీటర్లు

జుగాడ్‌పై 1,200 కిలోమీటర్లు.. కూలీల అవస్థలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చాలా మందిలో సహజంగా కనిపిస్తున్న ఆందోళన. ఇంటిని ఎలా చేరుకోవాలి? ఇదే చాలా మందిని కలవర పెడుతున్న ప్రశ్న. వెళ్లడానికి వాహనాలు లేక వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న దృశ్యాలు చాలా మంది హృదయాల్ని కదిలించి వేస్తున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. బిహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు 800 కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించారు.


ఢిల్లీలో పని చేస్తున్న బిహారీలు లాలూ మట్హో, గోరె లాల్ మట్హోతో పాటు వీరి కుటుంబ సభ్యుడు మరొక వ్యక్తి స్కూటర్ ఇంజిన్‌ను జుగాడ్‌(మోటార్‌తో చేసిన రిక్షా)కు అమర్చుకొని సొంతింటికి ప్రయాణం ప్రారంభించారు. మొత్తం వారి ప్రయాణ దూరం 1,200 కిలో మీటర్లు. అయితే వారు 800 కిలోమీటర్లు ప్రయాణించారు. లఖ్‌నవూకి 330 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అయితే వారి సాహస కార్యాన్ని తెలసుకున్న చందౌలీ జిల్లా యంత్రాంగం వారికి ఆహారాన్ని అందించింది. యూపీ పోలీసులు వారి ప్రయాణానికి మద్దతు ఇచ్చి సాగనంపారు.


ఈ విషయమై వారు మాట్లాడుతూ ‘‘మా దగ్గర సరిపడా డబ్బు లేదు. అయినా మా ప్రయాణాన్ని పూర్తి చేయాలని అనుకున్నాము. మాకు ఇంతకు మించి వేరే మార్గం లేదు. అందుకే ఈ వాహనాన్ని తాత్కాలికంగా ఉపయోగించాలని అనుకున్నాం. మా ప్రయాణాన్ని మూడు లేదా నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని అనుకుంటున్నాం’’ అని లాలూ అన్నారు.

Updated Date - 2020-03-28T00:51:54+05:30 IST