కేసుల్లో టర్కీని దాటి.. మరణాల్లో చైనాను మించి..

ABN , First Publish Date - 2020-05-30T08:13:05+05:30 IST

దేశంలో కరోనా హద్దుల్లేకుండా విజృంభిస్తోంది. వరుసగా ఆరు రోజుల పాటు ఆరు వేలపైగా కేసుల నమోదు గణాంకాలను చెరిపేస్తూ..

కేసుల్లో టర్కీని దాటి.. మరణాల్లో చైనాను మించి..

  • దేశంలో రికార్డు స్థాయిలో 7 వేలపైగా కేసులు
  • మహారాష్ట్రలో 2 వేలు దాటిన మృతులు

న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా హద్దుల్లేకుండా విజృంభిస్తోంది. వరుసగా ఆరు రోజుల పాటు ఆరు వేలపైగా కేసుల నమోదు గణాంకాలను చెరిపేస్తూ.. శుక్రవారం ఏకంగా 7,466 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో వచ్చిన అత్యధిక కేసులివే. దీంతో ప్రపంచ జాబితాలో భారత్‌.. 9వ స్థానానికి చేరింది. టర్కీ (1.61 లక్షలు) పదో స్థానానికి మారింది. తాజా 175 మరణాలతో.. దేశంలో మృతుల సంఖ్య 4,706 అయింది. తద్వారా కరోనా జన్మస్థానమైన చైనా (84,106 కేసులు, మరణాలు 4,634)లో కంటే భారత్‌లోనే ఎక్కువమంది చనిపోయినట్లైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు.. గడచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,799గా మంత్రిత్వ శాఖ పేర్కొంది. 42.89 శాతం మంది కోలుకున్నారు. దేశ రాజధానిలో కొత్తగా అత్యధిక స్థాయిలో 1,106 కేసులు రికార్డయ్యాయి. ఇద్దరు రెసిడెంట్‌ డాక్టర్లతో పాటు ఎయిమ్స్‌కు చెందిన 11 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారినపడ్డారు. చెన్నై కరోనా బాధిత నగరంగా మారుతోంది. నగరంలో కొత్తగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.


కర్ణాటకలో అత్యధికంగా 248 మందికి పాజిటివ్‌ వచ్చింది. బెంగళూరు దూరదర్శన్‌ కెమెరా మన్‌కు పాజిటివ్‌గా తేలింది. కేంద్రం డైరెక్టర్‌ సహా 14 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం ఒంటి గంట వార్తలు ప్రసారం కాలేదు. వీడియో జర్నలిస్ట్‌కు వైరస్‌ సోకడంతో ఢిల్లీ దూరదర్శన్‌ కార్యకలాపాలను మండీ హౌస్‌ నుంచి కెలాగోన్‌కు మార్చారు. పార్లమెంటు అనుబంధ భవనంలో డైరెక్టర్‌ స్థాయి అధికారికి పాజిటివ్‌ రావడంతో భవనంలో రెండు అంతస్తులను సీజ్‌ చేశారు. 


పోలీసుల పాలిట ‘మహా’మ్మారి

మహారాష్ట్రలో మరో 2,682 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 116 మంది మృతి చెందారు. మొత్తం మరణాలు 2,098 అయ్యాయి. రాష్ట్రంలో కరోనా బాధిత పోలీసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మొత్తం 2,211 మంది సిబ్బంది వైరస్‌కు గురయ్యారు. వీరిలో 116 మందికి శుక్రవారమే కొవిడ్‌ సోకింది. పశ్చిమబెంగాల్‌ అగ్నిమాపక సర్వీసుల శాఖ మంత్రి సుజిత్‌ బోస్‌, ఆయన కుటుంబ సభ్యుడొకరికి పాజిటివ్‌ వచ్చింది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్‌ దారువాలా కరోనాతో అహ్మదాబాద్‌లో మృతిచెందారు.

Updated Date - 2020-05-30T08:13:05+05:30 IST