61శాతం భారతీయుల్లో మానసిక సమస్యలు

ABN , First Publish Date - 2020-05-18T08:49:40+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో అస్థిరత, ఆర్థికపరమైన సమస్యలతో 61శాతంమందికి పైగా భారతీయులు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని ది మావెరిక్స్‌ ఇండియా అనే సంస్థ చేసిన సర్వేలో...

61శాతం భారతీయుల్లో మానసిక సమస్యలు

  • ఉద్యోగుల జీవితాల్లో భాగమవనున్న ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’
  • లాక్‌డౌన్‌ ప్రభావంపై సర్వే వెల్లడి

న్యూఢిల్లీ, మే 17: లాక్‌డౌన్‌ కాలంలో అస్థిరత, ఆర్థికపరమైన సమస్యలతో 61శాతంమందికి పైగా భారతీయులు మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని ది మావెరిక్స్‌ ఇండియా అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మిలీనియల్స్‌(1981-96 మధ్యలో పుట్టినవారు), జెన్‌-జెడ్‌(1997 తర్వాత పుట్టినవారు) తీవ్రంగా ప్రభావితమయ్యారని సర్వే నివేదిక పేర్కొంది. మహిళలు సైతం, ఆఫీసు బాధ్యతలు, ఇంటి పనులు ఒకేసారి నిర్వర్తిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని స్పష్టం చేసింది. 600మంది చీఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అధికారులు(సీఎక్స్‌ఓ), ఇతర ఉద్యోగులపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వే నివేదికను మావెరిక్స్‌ ఇండియా సంస్థ ఆదివారం విడుదల చేసింది.


ఆ సర్వే ప్రకారం:

కరోనా తర్వాత కనిపించే అతి పెద్ద మార్పు, ఇంటి వద్ద నుంచే పనిచేసేవారి పెరుగుదల. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనేది మున్ముందు మరిన్ని సంస్థలు తమ ఉద్యోగులకు కల్పిస్తాయని 46శాతానికిపైగా సీఎక్స్‌ఓలు అభిపాయ్రపడ్డారు. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకయ్యే సమయం, శ్రమ పనిలో కలిసివస్తాయని సంస్థలు భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇటు సంస్థలకు సైతం విద్యుత్‌  ఖర్చు, అద్దె ఖర్చులు కలిసి వస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉద్యోగులు మాత్రం, కార్యాలయాలకు వెళ్లి పనిచేసేందుకే ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్వస్థాయికి చేరుకునేందుకు చాలాకాలం పడుతుందని 90శాతంమంది సీఎక్స్‌వోలు అభిప్రాయపడ్డారు. కనీసం ఏడాది సమయం పడుతుందని 72శాతంమంది పేర్కొనగా.. రెండేళ్లలోపు కోలుకోవడం కష్టమని 26శాతం మంది స్పష్టం చేశారు. కరోనా వైర్‌సను ఎదుర్కోవడంలో, ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో విఫలమైన చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతుందని 51శాతంమందికి పైగా తెలిపారు. వచ్చే 6నెలల్లో, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయమని 67శాతంమంది వెల్లడించారు. కరోనాకు ఔషధం వచ్చేవరకూ ప్రయాణాల్ని వీలైంతనమేర తగ్గించుకుంటామని వారు పేర్కొన్నారు.


Updated Date - 2020-05-18T08:49:40+05:30 IST