ఒక్క రోజులో 60 వేల రికవరీలు

ABN , First Publish Date - 2020-08-20T07:07:53+05:30 IST

దేశంలో కోలుకుంటున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 60,091 మంది రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది...

ఒక్క రోజులో 60 వేల రికవరీలు

  • మొత్తం కేసుల్లో పావు శాతంలోపునకు ‘యాక్టివ్‌’లు
  • దేశంలో 20 లక్షలు దాటిన కోలుకున్నవారి సంఖ్య
  • కొత్తగా 64,531 కేసులు.. 1,092 మంది మృతి
  • కేరళలో తొలిసారిగా 2 వేల మందిపైగా పాజిటివ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో కోలుకుంటున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 60,091 మంది రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. క్రితం రోజు 57,584 మంది కోలుకోవడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20 లక్షలు దాటింది. రికవరీల నేపథ్యంలో మొత్తం కేసుల్లో (27.67 లక్షలు).. యాక్టివ్‌ కేసుల శాతం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం అది 24.45 శాతం (6.76 లక్షలు)గా ఉంది. మరోవైపు రికవరీ రేటు మరింత పెరిగి 73.64 శాతం అయింది. మరణాల రేటు 1.91కి తగ్గింది. దేశంలో కొత్తగా 64,531 మందికి వైరస్‌ సోకింది. 1,092 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజు వ్యవధిలో ఇదే అత్యధికం. అయితే, క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య 200పైనే ఎక్కువ.


85 శాతం మరణాలు ఏడు రాష్ట్రాల్లోనే..

దేశంలో కొత్తగా నమోదైన మరణాల్లో 85 శాతం ఏడు రాష్ట్రాలవే. గత వారం పరిస్థితులు కుదుటపడ్డట్లు కనిపించిన మహారాష్ట్రలో తాజాగా 422 మంది చనిపోయారు. రికార్డు స్థాయిలో 13,165 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక (139), తమిళనాడు (121)ల్లోనూ మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌ (88), ఉత్తరప్రదేశ్‌ (70), పశ్చిమబెంగాల్‌ (55)కు తోడుగా కొత్తగా పంజాబ్‌ (35)లో వైరస్‌తో మరణాలు పెరుగుతున్నాయి. కేరళలో తొలిసారి 2,333 కేసులు రావడం గమనార్హం. ఢిల్లీలో మరో 1,374 మంది మహమ్మారి బారినపడ్డారు. రికవరీ రేటు అధికం (90.11)గా, పాజిటివ్‌ రేటు (6.77) తక్కువగా ఉండటం ఊరట. ఒడిశాలో 2,239 కేసులు వచ్చాయి. రోగులకు చికిత్స చేస్తూ అసోం వైద్యులు, నర్సుల్లో 70 శాతం వరకు వైరస్‌ ప్రభావానికి గురయ్యారని వైద్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వీరిలో వైద్యులే 300 మంది ఉన్నారని వివరించారు.


Read more