వింగ్స్ ఇండియా షోలో ఆరుపదుల పైలట్ల విన్యాసాలు
ABN , First Publish Date - 2020-03-13T08:57:39+05:30 IST
పక్క పక్కనే గాల్లో దూసుకెళుతున్న మూడు చిన్న విమానాలు... ఒక్కసారిగా నేలవైపు పడిపోతాయా అన్నట్లు ఒకే వరుసలో దూసుకొచ్చి.. అంతలోనే మళ్లీ గాల్లోకి ...

హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పక్క పక్కనే గాల్లో దూసుకెళుతున్న మూడు చిన్న విమానాలు.. ఒక్కసారిగా నేలవైపు పడిపోతాయా అన్నట్లు ఒకే వరుసలో దూసుకొచ్చి.. అంతలోనే మళ్లీ గాల్లోకి ఎగిరిన వైనం. అలా పలుమార్లు చక్కర్లు!! ఒళ్లుగగుర్పొడిచేలా అరగంటపాటు సాగిన ఆ విన్యాసాలను వీక్షించిన సందర్శకులు థ్రిల్ ఫీలయ్యారు. ఈ విన్యాసాలు చేసిన ముగ్గురిలో ఒకరు ఆరుపదుల వయసు దాటితే.. మరొకరు ఆరు పదులకు దగ్గరగా ఉన్నారు.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో గురువారం వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో భాగంగా వీరి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన గ్లోబల్ స్టార్స్ ఏరోబేటిక్ బృందంలోని ముగ్గురు పైలట్లు ఈ విన్యాసం చేశారు. వీరిలో లండన్‌కు చెందిన మార్క్ జెఫరీస్(61) పెద్ద వయస్కుడు. 40ఏళ్ల నుంచి వివిధ విమానాలను నడిపిన ఆయన 25ఏళ్లుగా వివిధ దేశాల్లో విమాన విన్యాసాల్లో పాల్గొంటున్నారు. స్టీవ్ కార్వర్(58) అనే పైలట్.. విన్యాసాలకు నాయకత్వం వహించారు. 200 మైళ్ల నుంచి 400 మైళ్ల వేగంతో 2- 3వేల అడుగుల ఎత్తులో విన్యాసాలు చేశారు. మరో పైలట్ క్రిస్ బర్కెట్ట్(42) 2దశాబ్దాలుగా విన్యాస విమానాలు నడుపుతున్నారు.