6 లక్షల ప్రాణాలు బలి

ABN , First Publish Date - 2020-07-20T07:19:12+05:30 IST

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. విశ్వవ్యాప్తంగా 1.42 కోట్ల మందికి సోకిన వైరస్‌...

6 లక్షల ప్రాణాలు బలి

  • అన్ని దేశాల్లోనూ కరోనా విశ్వరూపం
  • ఐదో స్థానానికి ఎగబాకిన దక్షిణాఫ్రికా

జొహాన్నెస్‌బర్గ్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. విశ్వవ్యాప్తంగా 1.42 కోట్ల మందికి సోకిన వైరస్‌.. ఇప్పటివరకు 6,05,619 ప్రాణాలను బలిగొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,59,848 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనా తీవ్రతకు ఎక్కవగా బలైన అమెరికాలో పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు.


అగ్రరాజ్యంలో 24 గంటల్లో 63 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 38,33,271కి పెరిగింది. ఇక కొత్త కేసుల నమోదులో రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ప్రపంచ జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాలో కొత్తగా 13,285 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 3,50,879కి చేరింది. ఈ క్రమంలో పెరూ (3,49,500)ని వెనక్కునెట్టింది. ప్రపంచ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బ్రెజిల్‌ (20,75,246), భారత్‌ (10,80,194), రష్యా (7,71,546) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వైరస్‌ నియంత్రణలోకి వచ్చిందనుకుంటున్న ఆస్ర్టేలియాలోనూ మళ్లీ కేసుల విజృంభణ పెరిగింది. ఇక్కడ కొత్తగా 363 కేసులు బయటపడగా.. కరోనాతో ముగ్గురు మరణించినట్టు అధికారులు ప్రకటించారు. విక్టోరియా రాష్ట్రంలో కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక వైరస్‌ పుట్టినిల్లు చైనాలో తాజాగా 13 కేసులు వెలుగుచూశాయి. దక్షిణ కొరియాలో 40 మందికి వైరస్‌ సోకింది. మెక్సికోలో కొత్తగా 7,615 మందికి పాజిటివ్‌గా తేలగా.. పాకిస్థాన్‌లో 1,580, సింగపూర్‌లో 257 కేసులు బయటపడ్డాయి.


Updated Date - 2020-07-20T07:19:12+05:30 IST