తుపాను సహాయక విధులకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా
ABN , First Publish Date - 2020-06-11T22:02:28+05:30 IST
ఒడిశాలో ఇవాళ కొత్తగా మరో 136 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. వీరిలో 54 మంది వరకు..

భువనేశ్వర్: ఒడిశాలో ఇవాళ కొత్తగా మరో 136 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. వీరిలో 54 మంది వరకు ఇటీవల పశ్చిమ బెంగాల్లో అంఫన్ తుపాను సహాయక విధుల కోసం వెళ్లిన విపత్తు సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఒడిశాలో మొత్తం కొవిడ్-19 కేసులు 3,386కు చేరాయి. ఈ మహమ్మారి కారణంగా ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 9కి చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన 136 కేసుల్లో 14 జిల్లాలకు చెందిన 134 మంది పేషెంట్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి, ప్రాధమిక పరిశీలన కోసం క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారే కావడం గమనార్హం. మరో ఇద్దరు పేషెంట్లు స్థానికులుగా గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నమాపక దళం సహా తుపాను సహాయక చర్యల కోసం ఇటీవల బెంగాల్ వెళ్లి వచ్చిన 54 మందికి కరోనా సోకినట్టు తేలింది. కాగా ఈ నెల ప్రారంభంలో 49 మంది ఎన్డీఆర్ఎఫ్, 12 మంది ఒడిశా అగ్నిమాపక సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,092 మంది యాక్టివ్ పేషెంట్లు ఉండగా.. 2,282 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.