దేశంలో 40 లక్షల కేసులు

ABN , First Publish Date - 2020-09-05T07:18:22+05:30 IST

వరుసగా రెండో రోజు 11 లక్షలపైగా పరీక్షలు.. 80 వేలపైగా కేసులు..! దేశంలో కరోనా ఉధృతి తీరిది.

దేశంలో  40 లక్షల కేసులు

రెండో రోజూ 80 వేలపైగా.. 

1,096 మంది మృతి

మహారాష్ట్రలో 

ఒక్క రోజే 19 వేల కేసులు

ఢిల్లీ, యూపీల్లో విజృంభణ

5 రాష్ట్రాల్లో కేసుల తగ్గుదల


న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: వరుసగా రెండో రోజు 11 లక్షలపైగా పరీక్షలు.. 80 వేలపైగా కేసులు..! దేశంలో కరోనా ఉధృతి తీరిది. దీనికి తోడుగా.. మరణాలు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 83,341 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 1,096 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఒక రోజు వ్యవధిలో మరణాల పరంగా ఇదే గరిష్ఠం. ఆగస్టు 19వ తేదీన 1,092 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 70 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌వే.


కాగా.. గురువారం 11.69 లక్షల మందికి పరీక్షలు చేశారు. పాజిటివ్‌ రేటు 7.5 అని కేంద్రం పేర్కొంది. మరోవైపు తాజాగా 66,659 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో వరుసగా 8వ రోజు 60 వేల మందిపైగా రికవరీ అయినట్లైంది. ఇప్పటివరకు 30.37 లక్షల మంది కోలుకోగా.. రికవరీ రేటు 77.15కు చేరిందని కేంద్రం వివరించింది. దేశంలోని యాక్టివ్‌ కేసుల్లో 62 శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుల్లోనే ఉన్నాయి.


అయితే, ఆగస్టు 13-19 మధ్య వారంతో పోలిస్తే ఆగస్టు 27-సెప్టెంబరు 2 మధ్య వారంలో ఈ రాష్ట్రాల్లో రోజువారీ యాక్టివ్‌ కేసుల్లో తగ్గుదల కనిపించినట్లు కేంద్రం వివరించింది. ఈ తగ్గుదల తమిళనాడులో అత్యధికంగా 24 శాతం ఉందని తెలిపింది. కాగా.. శుక్రవారం రాత్రి నాటికి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 40 లక్షలు దాటింది. రెండో స్థానంలోని బ్రెజిల్‌కు అతి సమీపంలో ఉంది. కాగా గురువారం యూపీలో తొలిసారి బాధితుల సంఖ్య 6వేలు దాటింది. ఢిల్లీలో 67 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా 2,916 కేసులు నమోదయ్యాయి. 


మహారాష్ట్ర స్పీకర్‌కు కరోనా..

అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజుల్లో ప్రారంభం కానుండగా.. మహారాష్ట్ర స్పీకర్‌ నానా పటోలేకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. పశు సంవర్ధక శాఖ మంత్రి సునీల్‌ కేదార్‌కూ వైరస్‌ సోకింది. శుక్రవారం ఏకంగా 19,218 కేసులు బయటపడ్డాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియాకూ కొవిడ్‌ నిర్ధారణ అయింది. కర్ణాటకలో కొత్తగా 9,280 కేసులు వచ్చాయి. 


ఎంపీలు, కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంటు సభ్యు(ఎంపీ)లతోపాటు వారి కుటుంబసభ్యులు, ఆంతరంగిక సిబ్బందికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ విధివిధానాలను రూపొందిస్తూ పలు సూచనలు చేసింది.


సమావేశాలు ప్రారంభానికి 72 గంటల ముందే వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకున్న వారిలో ఏ ఒక్కరికైనా పాజిటివ్‌ నిర్ధారణ అయినా, ఆ పార్లమెంటు సభ్యుడు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎంపీల ఇళ్లలో పనిచేసే వారికీ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ ఎంపీలు కరోనా పరీక్షలు చేయించుకోకుండా సమావేశాలకు హాజరైనట్లయితే.. పార్లమెంటు భవనంలో రిసెప్షన్ల వద్ద ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2020-09-05T07:18:22+05:30 IST