అమిత్ షా పేరుతో నకిలీ పోస్ట్.. నలుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-10T02:09:53+05:30 IST

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో నకిలీ ట్వీట్స్ ప్రచారం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా పేరుతో...

అమిత్ షా పేరుతో నకిలీ పోస్ట్.. నలుగురి అరెస్ట్

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో నకిలీ ట్వీట్స్ ప్రచారం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా పేరుతో ఉన్న అధికారిక ట్విట్టర్‌ పోస్ట్ వచ్చేలా ఎడిట్ చేసి.. అమిత్ షా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అందుకే బయటకు రావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన అహ్మదాబాద్ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్తలన్నీ అసత్యాలని అమిత్ షా స్పష్టం చేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ట్విటర్ వేదికగా షా కోరారు. దీనిపై అహ్మదాబాద్ స్పెషల్ కమిషనర్ అజయ్ తోమర్ మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగాలేదని, ఈ విషయాన్ని ఆయనే తన ట్విటర్ ఖాతా వెల్లడించినట్లు ఓ ట్విటర్ ఖాతా స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరిపి ఫిరోజ్ ఖాన్, సర్ఫరాజ్, సజ్జద్ అలీ, షిరాజ్ హుస్సేన్  అనే నలుగురు నిందితులను అరెస్టు చేశామని, వారిపై ఐపీసీ సెక్షన్ 66(సీ), 66(డీ) కింద కేసు నమోదు చేశామని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వివరించారు.


ఇదిలా ఉంటే ఈ వార్తలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ట్రోల్స్‌పై స్పందించారు. ఒకరి ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు సందేశాలను వ్యాప్తి చేయడం ఖండించతగిన విషయమని అన్నారు. ఇలా చేస్తున్న వారి మనస్తత్వం ఏలాంటిదో వీటిని చూస్తేనే అర్ధమవుతుందోని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి పేరుతో ఫేక్ ట్వీట్స్ చేసిన నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2020-05-10T02:09:53+05:30 IST