మరో 35 వేల పాజిటివ్‌లు!

ABN , First Publish Date - 2020-07-19T07:03:29+05:30 IST

దేశంలో వరసగా రెండో రోజూ అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 34,884 మంది వైరస్‌ బారిన పడ్డారు...

మరో 35 వేల పాజిటివ్‌లు!

  • దేశంలో మొత్తం కేసులు 10.38 లక్షలు
  • 26,273కు చేరిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలో వరసగా రెండో రోజూ అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 34,884 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,38,716కు చేరింది. వరసగా మూడో రోజు కూడా 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 671 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 26,273కు చేరుకుంది. కోలుకున్న వారి సంఖ్య 6,53,750కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 3,58,692 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 62.94 శాతం రోగులు రికవరీ అయినట్లు వివరించింది. ఇక దేశవ్యాప్తంగా ఈ నెల 17 వరకు 1.34 కోట్ల టెస్టులు చేశారని, శుక్రవారం ఒక్కరోజే 3.61 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంభవించిన 26,273 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే 11,452 ఉన్నాయని తెలిపింది. 3,597 మరణాలతో ఢిల్లీ, 2,403 మరణాలతో తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వివరించింది. మృతుల్లో 70 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 2,92,589 పాజిటివ్‌లు ఉన్నట్లు పేర్కొంది. తమిళనాడులో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4,807 కేసులు వచ్చాయి. మొత్తం 1,65,714 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఒక్కరోజులోనే అత్యధికంగా 88 మంది మృతి చెందారు. ఇక 1,21,582 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో, 55,115 కేసులతో కర్ణాటక నాలుగో స్థానంలో ఉన్నాయి. 


కర్ణాటకలో పండుగలు యథాతథం 

పండుగల సీజన్‌ ప్రారంభం కావడంతో వీటి విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలు, మార్గదర్శకాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో మత పెద్దలతో సమావేశం నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి శనివారం మీడియాకు వెల్లడించారు. ఏ పండుగ నిర్వహణనూ నిషేధించబోమని అయితే అత్యంత నిరాడంబరంగా, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే జరుపుకొనేలా మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో శనివారం రికార్డు స్థాయిలో 4,537 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 60 వేలకు చేరువైంది. బెంగళూరులో 2,125 మందికి, దక్షిణకన్నడలో 509 మందికి వైరస్‌ సోకింది. తాజాగా 93 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,240కు చేరింది. రాష్ట్రమంతటా వైరస్‌ విస్తరిస్తున్న తరుణంలో మూడో ఆదివారం కర్ణాటక వ్యాప్తంగా సం పూర్ణ లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటుంది. 


ఇరాన్‌లో 2.5 కోట్ల మందికి వైరస్‌

ఇంకా 3.5కోట్ల మందికి సోకనుంది.. దేశాధ్యక్షుడు రూహానీ

ఇరాన్‌ను కరోనా కకావికలం చేస్తోంది. దేశ జనాభాలో ఏకంగా 25ు మందికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు 2.5 కోట్ల మంది ఇరానియన్లకు కరోనా సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నామని ఆ దేశాధ్యక్షుడు హస్సన్‌ రౌహానీ ప్రకటించారు. అంతేకాదు, రానున్న నెలల్లో మరో 3-3.50 కోట్ల మంది వైరస్‌ బారిన పడే అవకాశం ఉందన్నారు. అంటే ఆయన అంచనా ప్రకారం అప్పటికి దేశ జనాభాలో దాదాపు 75ు మందికి కరోనా సోకుతుందన్నమాట. ఇంతకీ ఆ దేశ జనాభా సుమారు 8కోట్ల 10లక్షలు. అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను రౌహానీ కోరారు. కాగా, ఇప్పటి వరకు 13,979 మంది మృత్యువాత పడ్డారు. గత 24గంటల్లో 2,166 మంది కరోనా సోకగా.. 188 మంది మృతి చెందారు. 


Updated Date - 2020-07-19T07:03:29+05:30 IST