రోజువారీ కూలీపై 3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు

ABN , First Publish Date - 2020-12-06T07:00:58+05:30 IST

అతడో రోజువారీ కూలీ. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.198 పొందుతూ జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి వస్తుసేవల పన్ను(జీఎస్టీ) గురించి తెలుసోలేదో.

రోజువారీ కూలీపై 3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు

అరెస్ట్‌ చేసేందుకు వెళ్లి అవాక్కయిన పోలీసులు 


జమ్‌షెడ్‌పూర్‌, డిసెంబరు 5: అతడో రోజువారీ కూలీ. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.198 పొందుతూ జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి వస్తుసేవల పన్ను(జీఎస్టీ) గురించి తెలుసోలేదో. కానీ రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో తనను అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాయ్‌పహారీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 48 ఏళ్ల లాదున్‌ ముర్ము అధికారిక రికార్డుల ప్రకారం ఎంఎస్‌ స్టీల్‌ అనే కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ఇతనిపై కేసు నమోదైంది. జీఎస్టీ చెల్లించనందుకు ఝార్ఖండ్‌ స్టేట్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎంఎస్‌ స్టీల్‌ ఎండీని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వెళ్లారు.


లాదున్‌ ముర్ము ఇంటికి వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. అతను రోజువారీ కూలీగా పని చేస్తూ జీవిస్తున్నట్టు తెలుసుకున్నారు. అయితే ఈ వ్యక్తి పేరు మీద నకిలీ కంపెనీని ఏర్పాటు చేశారని, ఇందుకు సదరు వ్యక్తి డూప్లికేట్‌ పాన్‌, ఆధార్‌ కార్డులను వినియోగించారని పోలీసుల విచారణలో తేలింది. 

Read more