ఎంపీల జీతభత్యాల్లో 30 శాతం కోత
ABN , First Publish Date - 2020-04-07T07:31:21+05:30 IST
కరోనాపై పోరుకు నిధుల సేకరణ జరుపుతున్న కేంద్రం సోమవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి.. పార్లమెంటు సభ్యుల వేతనాలపై కోత విఽధింపు కాగా రెండోది...

- ఏడాది పాటు అమలు.. త్వరలో ఆర్డినెన్స్
- రెండేళ్లపాటు ఎంపీ ల్యాడ్స్ నిధులు రద్దు
- 7900 కోట్లు కరోనా సంఘటిత నిధికి
- కాంగ్రెస్, తృణమూల్ వ్యతిరేకత
కరోనాపై పోరుకు నిధుల సేకరణ జరుపుతున్న కేంద్రం సోమవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి.. పార్లమెంటు సభ్యుల వేతనాలపై కోత విఽధింపు కాగా రెండోది.. ఎంపీల్యాడ్స్ నిధుల నిలిపివేత. ఏడాది పాటు పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న సుమారు 750 మంది సభ్యుల వేతనాలలో 30శాతం కోత విధించాలని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్‌ను తీసుకురావడానికి కేబినెట్ ఆమోదించింది. పార్లమెంటు సభ్యులతో పాటు ప్రధాని, కేంద్రమంత్రుల వేతనాలలోనూ ముప్పై శాతం కోత విధించనున్నట్లు సమాచార మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఇదే రీతిలో వేతనాలలో కోతకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు అన్ని రాష్ర్టాల గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. వేతనాలలో కోత నిర్ణయం ఈ ఏప్రిల్ నెల నుంచే వర్తిస్తుందన్నారు. పార్లమెంటు సభ్యులకు తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికోసం అమలు చేస్తున్న ఎంపీల్యాడ్స్ పథకానికి చెందిన నిధుల విడుదలనూ రెండేళ్లు నిలిపివేయాలని నిర్ణయించినట్లు జావడేకర్ తెలిపారు. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.7900కోట్లు కరోనా నియంత్రణ చర్యల నిధిలో జమవుతాయన్నారు.
ఎంపీల జీతాల్లో కోతను స్వాగతించినప్పటికీ ఎంపీల్యాడ్స్ నిధుల నిలిపివేతను విపక్ష సభ్యులు ఈసందర్భంగా తప్పుబట్టారు.