భారత్‌కు రానున్న మరో 3 రాఫెల్ జెట్లు
ABN , First Publish Date - 2020-10-28T19:37:21+05:30 IST
భారత వైమానిక దళానికి త్వరలో మరింత బలం చేకూరనుంది. ఫ్రాన్స్ నుంచి మరో...

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి త్వరలో మరింత బలం చేకూరనుంది. ఫ్రాన్స్ నుంచి మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు నవంబర్ 5న భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఫ్రాన్స్ నుంచి తదుపరి విడతగా మూడు రాఫెల్ జెట్లు నేరుగా అంబాలా విమానాశ్రయానికి చేరుకుంటాయి. గత జూలై 29న అబు దబీ మీదుగా 5 రాఫెల్స్ జెట్లు భారత్‌కు చేరుకోగా, వాటిని ఇప్పటికే ఐఏఎఫ్ స్క్వాడ్రన్ 17కి అప్పగించారు. సెప్టెంబర్ 10న అంబాలా ఎయిర్‌బోస్‌లో ఈ ఐదు రాఫెల్ జెట్లను ప్రవేశపెట్టిన కార్యక్రమంలో ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లె, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పాల్గొన్నారు.
2016లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం రూ.59,000 కోట్ల ఒప్పందం కింద భారత్‌కు 36 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ అప్పగించాల్సి ఉంటుంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మరో 16 రాఫెల్ ఫైటర్లు ఐఏఎఫ్‌లో వచ్చి చేరనున్నాయి. ఈ 16 ఓమ్ని-రోల్ రాఫెల్ జెట్ ఫైటర్లను 2021 ఏప్రిల్‌లో గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద జెట్ ఇంజన్ తయారీదారు సఫ్రాన్ సైతం ఇండియాలో ఫైటర్ జెట్లు, విడిభాగాల తయారీకి తాము సిద్ధమేనని చెబుతోంది.