కోవిడ్ ఎఫెక్ట్: మూడు గ్రామాలకు సీల్

ABN , First Publish Date - 2020-07-05T22:31:39+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి భయంతో అసోంలోని మూడు గ్రామాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. నాగాన్ జిల్లాలో..

కోవిడ్ ఎఫెక్ట్: మూడు గ్రామాలకు సీల్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి భయంతో అసోంలోని మూడు గ్రామాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. నాగాన్ జిల్లాలో ఇస్లాం మత బోధకుడి అంత్యక్రియలకు శనివారంనాడు వేలాది మంది జనం హాజరుకావడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు.


ఆల్ ఇండియా జమాయిత్ ఉలేమా అధ్యక్షుడు, ఈశాన్య ప్రాంత అమీర్-ఇ-షరియత్‌కు చెందిన 87 ఏళ్ల ఖైరుల్ ఇస్లాం అంత్యక్రియలు ఈనెల 2న జరిగాయి. నిజానికి జూలై 3న అంత్యక్రియల కోసం ఊరేగింపు జరపాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ ఆ తర్వాత 2వ తేదీనే అంత్యక్రియలకు నిర్ణయించారు. దీంతో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది జనం హాజరయ్యారు. ఇస్లాం కుమారుడు, ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


కాగా, ఇస్లాం ప్రవక్త అంత్యక్రియల్లో 10,000 మందికి పైగా హాజరై ఉంటారని పోలీసులు అంచనా వేశారు. రెండు పోలీసు కేసులు కూడా నమోదు చేశారు. చుట్టపక్కల మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. కాగా, దీనిపై అమినుల్ ఇస్లాం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రికి చాలా పెద్ద పేరు, ఎందరో అనుచరులు ఉన్నారని, ప్రోటోకాల్‌ను అనుసరించే తన తండ్రి మరణం గురించి అధికారులకు తెలియజేసి, అందుకు అనుగుణంగానే అంత్యక్రియలు జరిపామన్నారు. పరిమిత సంఖ్యలోనే జనం హాజరయ్యారని చెప్పారు. కాగా, గత ఏప్రిల్‌లో అమినుల్ ఇస్లాం మతపరమైన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ఉంచడంతో ఆయనను అరెస్టు చేశారు. దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. తాజా గణాంకాల ప్రకారం అసోంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,000కు చేరింది.

Updated Date - 2020-07-05T22:31:39+05:30 IST