32 కోట్ల మందికి రూ.29 వేల కోట్లు

ABN , First Publish Date - 2020-04-14T08:53:56+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా దెబ్బతిన్న వారిలో 32 కోట్లమందికిపైగా పేదలకు కేంద్రం ఇప్పటిదాకా రూ.29,352 కోట్ల సాయం అందించింది. గత నెలలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు పేదల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...

32 కోట్ల మందికి రూ.29 వేల కోట్లు

  • రాష్ట్రాలకు 20.11 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు 
  • 22.12 లక్షల వైద్య సిబ్బందికి బీమా
  • కరోనా ప్యాకేజీలో కేంద్రం పంపిణీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: కరోనా వైరస్‌ కారణంగా దెబ్బతిన్న వారిలో 32 కోట్లమందికి పైగా పేదలకు కేంద్రం ఇప్పటిదాకా రూ.29,352 కోట్ల సాయం అందించింది. గత నెలలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు పేదల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.70లక్షల కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించారు. మహిళలకు, పేద సీనియర్‌ సిటిజన్లకు, రైతులకు ఉచితంగా ఆహార ధాన్యాలు, నగదు అందించారు. ఈ ప్యాకేజీని బాధిత వర్గాలకు సత్వరమే అమలుచేసే కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయని ఆర్థిక శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌ వల్ల బాధితులకు సత్వర సాయం అందించేందుకు ఆర్థిక, ఇతర మంత్రిత్వశాఖలు, కేబినెట్‌ సెక్రటేరియట్‌, ప్రధాని కార్యాలయం తమ వంతు కృషి చేస్తున్నాయని ప్రభుత్వం వివరించింది. లక్షిత వర్గాల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ అయ్యే విధంగా ‘ఫైన్‌టెక్‌’, డిజిటల్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్యాకేజీ కింద ఈనెల 13నాటికి 32.32 కోట్లమంది లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా మొత్తం రూ.29,352 కోట్లు బదిలీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌ నెలకు ఇప్పటిదాకా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 20.11 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపించామని తెలిపింది. ఏప్రిల్‌ కోటా కింద 5.29 కోట్ల లబ్ధిదారులకు 2.65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను సరఫరా చేశామని ఆర్థిక శాఖ వివరించింది. 3,985 టన్నుల పప్పులను కూడా పంపించామని పేర్కొంది.


ఇంతవరకు 1.39 కోట్ల వంటగ్యాస్‌ సిలిండర్లను బుక్‌ చేశామని, వాటిలో లబ్ధిదారులకు 97.8 లక్షల సిలిండర్లను ఉచితంగా సరఫరా చేశామని ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్‌ పథకం కింద తొలి విడతగా రూ.14,946 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. మొత్తం 8 కోట్ల మంది రైతులకుగాను దాదాపు 7.47 కోట్ల మంది ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నగదు బదిలీ అయ్యింది. జన్‌ధన్‌ పథకం కింద ఏకంగా 19.86 కోట్ల మంది మహిళల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదు బదిలీ చేశారు. ఈనెల 13కల్లా ఈ పథకం కింద మొత్తం రూ.9,930 కోట్లు అందించినట్లయ్యింది. 2.82 కోట్ల మంది వృద్ధులకు,వితంతువులకు, దివ్యాంగులకు రూ. 1400 కోట్లు చెల్లించినట్లు ఆర్థిక శాఖ వివరించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు ఏప్రిల్‌లో రూ.500, మేలో మరో రూ.500 చెల్లించనున్నారు. 2.17 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం రూ.3,071 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కరోనా రోగులకు వైద్యం చేసే ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఉచితంగా రూ.50 లక్షల జీవితబీమాను అందిస్తోంది.

Updated Date - 2020-04-14T08:53:56+05:30 IST