24 మంది ఎంపీలకు కోవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-14T21:15:55+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కోవిడ్ పాజిటివ్ ..
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు 24 మంది లోక్‌సభ ఎంపీలకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు కోవిడ్ పరీక్షలు అనివార్యం చేశారు.
రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇతరుల్లో రీటా బహుగుణ జోషి, కౌశల్ కిషోర్, సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం జి, ప్రతాపరావు పాటిల్, రామ్ శంకర్ కథేరియా, సత్యపాల్ సింగ్, రాడ్మల్ నగర్ ఉన్నారు. ఆది, సోమవారాల్లో ఎంపీలకు ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
కరోనా ముప్పు కొనసాగుతున్నందున పార్టీలకు అతీతంగా పలువురు సీనియర్ ఎంపీలు సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో తొలిరోజున లోక్‌సభ ఛాంబర్‌కు సుమారు 200 మంది సభ్యులు హాజరయ్యారు. విజిటర్స్ గ్యాలరీలో 30 మంది వరకూ సామాజిక దూరం పాటిస్తూ కూర్చొన్నారు. సహజంగా ఆరుగురు సభ్యులు కూర్చునే వరుసలో ముగ్గురికి పరిమితం చేశారు.
కాగా, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన జేఎంఎం నేత శిబు సోరెన్, డీఎంకే ఎంపీ టి.శివ తదితరులు సోమవారంనాడు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ కారణంగా ఎంపీలు సంతకం చేసిన పెన్నులను ఎప్పటికప్పుడు మార్చారు.