23 శాతం మందికి ఢిల్లీ జనాభాలో వైరస్‌!

ABN , First Publish Date - 2020-07-22T07:18:22+05:30 IST

దేశ రాజధాని జనాభాలో 23 శాతం మందిలో కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో తేలింది! అంటే.. వారంతా గతంలో వైరస్‌ బారిన పడినవారు!...

23 శాతం మందికి  ఢిల్లీ జనాభాలో వైరస్‌!

  • వారందరి దేహాల్లో యాంటీబాడీల అభివృద్ధి
  • ఆప్‌ సర్కారు నిర్వహించిన సీరో సర్వేలో వెల్లడి
  • వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న పటిష్ఠ చర్యల వల్లనే
  • 23 శాతం మందికి మాత్రమే సోకింది: కేంద్ర ఆరోగ్య శాఖ
  • ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం అంటున్న వైద్యనిపుణులు
  • ఢిల్లీ జనాభాలో 23శాతం అంటే.. 44 లక్షల మందికి వైరస్‌
  • సామూహిక రోగనిరోధక శక్తి దిశగా పయనం: వైద్యులు
  • టెస్టుల ద్వారా గుర్తించింది 2.81శాతం మందినే

న్యూఢిల్లీ, జూలై 21: దేశ రాజధాని జనాభాలో 23 శాతం మందిలో కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో తేలింది! అంటే.. వారంతా గతంలో వైరస్‌ బారిన పడినవారు! ‘‘దేశంలో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమై దాదాపు ఆరునెలలు గడుస్తోంది. జనసాంద్రత చాలా ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఇన్ని నెలల్లో 23.48 శాతం మంది మాత్రమే వైరస్‌ ప్రభావానికి గురయ్యారు’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారంనాడు ఘనంగా ప్రకటించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ), ఢిల్లీ సర్కారు కలిసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జూన్‌ 27 నుంచి జూలై 10 నడుమ దశలవారీగా 21,387 మంది రక్తనమూనాలను సేకరించి యాంటీబాడీ పరీక్షలు (సీరొలాజికల్‌ సర్వే) నిర్వహించారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 23 శాతం మంది ఇటీవలికాలంలో వైరస్‌ బారిన పడినట్టు తేల్చారు.


ఆర్నెల్ల వ్యవధిలో 23 శాతం మందికి మాత్రమే వైరస్‌ సోకిందని.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠమైన (లాక్‌డౌన్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వంటివి) చర్యలే ఇందుకు కారణమని కేంద్రం ఘనంగా చెప్పుకొంటోందిగానీ.. ఢిల్లీ జనాభా 1.9 కోట్లలో 23 శాతం అంటే దాదాపు 44.61 లక్షల మందికి వైరస్‌ సోకినట్టు! దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనకు ఢిల్లీ సర్వే బలం చేకూర్చేలా ఉంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతమని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలికాలంలో ఢిల్లీలో కేసుల సంఖ్య బాగా తగ్గిపోవడానికి కూడా కారణం ఇదేనని, హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా పయనించడమేనని వారు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. ఇన్ని లక్షల మంది శరీరాల్లో యాంటీబాడీస్‌ ఉండడం వల్ల.. వారు కరోనా వాహకులుగా ఉండరు. వారిపై కరోనా ప్రభావం ఉండదు. వారి ద్వారా మరొకరికి వ్యాపించదు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గుతుంది. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతోంది అదేనని వారు వివరిస్తున్నారు.


గణాంకాలను పరిశీలిస్తే.. జూన్‌ 23న ఢిల్లీలో అత్యధికంగా ఒక్కరోజే 3,947 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడు వారాల తర్వాత.. సోమవారంనాడు ఢిల్లీలో 1000లోపు కేసులు (954) నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా గత వారంరోజులుగా బాగా తగ్గుతూ వచ్చి రికవరీ రేటు 85 శాతానికి చేరింది. అందుకే.. ఢిల్లీలో కొవిడ్‌19 ఇప్పటికే పతాకస్థాయికి చేరుకుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సోమవారం అభిప్రాయపడ్డారు. కేసుల సంఖ్య తగ్గడాన్ని, ఢిల్లీ జనాభాలో 23 శాతం మందికిపైగా ఇప్పటికే వైరస్‌ సోకిందని సీరో సర్వేలో తేలడాన్ని కలిపి చూస్తే.. ఆ రాష్ట్రం హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా సాగుతున్నట్టుగా కనిపిస్తోందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. తగిన జాగ్రత్తలతో పాఠశాలలు, కళాశాలలను తెరవడం ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చని ఎయిమ్స్‌ వైద్యులు చేసిన సూచన కూడా ఈ కోణంలో చూస్తే కొంతమేరకు సరైనదేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి తీరుతెన్నులను గమనిస్తే ఎక్కువగా ప్రభావం చూపించిన చోట క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జనాభాలో ఎక్కువ మంది కరోనా బారిన పడడం, చాలామందికి లక్షణాలు కనిపించకపోవడం, వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందడం, తద్వారా వైరస్‌ వ్యాప్తి తగ్గడం... అమెరికాలో న్యూయార్క్‌ దగ్గర్నుంచి స్పెయిన్‌, ఇటలీ, బ్రిటన్‌, మన దగ్గర ఢిల్లీ, మహారాష్ట్ర దాకా ఇదే తీరు కనిపిస్తోంది.


‘మే’ నెలలో వ్యాప్తి ఒక శాతంలోపే!

దేశంలో కరోనావ్యాప్తి ఎంతమేరకు ఉందో పరిశీలించేందుకు భారత వైద్య పరిశోధన మండలి మే నెల మధ్య నుంచి చివరి దాకా ఒక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 83 జిల్లాల్లో సర్వే నిర్వహించగా.. 0.73 శాతం మందిలోనే యాంటీబాడీలు కనిపించాయి. అంటే వ్యాప్తి ఒకశాతంలోపే. కానీ, ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా 23 శాతం మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయంటే వైరస్‌ ఎంత ఉధృతంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు.


అలసత్వం వద్దు

ఢిల్లీ జనాభాలో కేవలం 23.48 శాతం మందికే వైరస్‌ సోకిందని పేర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ.. ఈ సమయంలో అలసత్వంతో వ్యవహరించకూడదని అభిప్రాయపడింది. మిగతా జనాభాకు వైరస్‌ సోకే అవకాశం ఉన్నందున కట్టడి చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించింది.


రెండు నెలలే రక్ష!

వైరస్‌ బారినపడినవారిలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీస్‌ రెండు, మూడు నెలల తర్వాత ప్రభావాన్ని కోల్పోవడం మరో సమస్య. ఒక ప్రాంతంలో ఇలా ఎక్కువ మందిలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయినా.. 2-3 నెలల తర్వాత వారున్నచోట ఇంకా వైర్‌సవ్యాప్తి కొనసాగుతూ ఉంటే వారు మళ్లీ వైరస్‌ బారిన పడే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ ఈ సమస్య తప్పదు. కానీ, ఢిల్లీ ఉదాహరణనే తీసుకుంటే 44 లక్షల మందికి వైర్‌ససోకితే వారిలో కేవలం 1.23 లక్షల మందికే వైరస్‌ సోకినట్టు గుర్తించారు. అంటే కేవలం 2.81 శాతం. వారిలోనూ ప్రాణాలు కోల్పోయినవారు 3663 మంది. నలభైనాలుగు  లక్షల మందిలో 3,663 మంది కరోనాకు బలయ్యారంటే మరణాల రేటు కేవలం 0.083 శాతం. కాబట్టి కరోనాకు మరీ అంత భయపడాల్సిన పని లేదని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.

‘కరోనా కవచ్‌’లో ఇకపై గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కూడా..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఐఆర్‌డీఏఐ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కరోనా కవచ్‌’ ఆరోగ్య బీమాపాలసీలో గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేసేందుకు బీమా సంస్థలను అనుమతించింది. దీంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ తమ ఉద్యోగులకు కరోనా నుంచి ఆరోగ్య భద్రత కల్పించే అవకాశం ఏర్పడింది. అలాగే.. ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, వలస కార్మికులకూ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. స్వల్పకాలిక, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీగా జూలై 10న ప్రారంభమైన ‘కరోనా కవచ్‌’.. స్వల్పకాలంలోనే విశేషంగా ప్రజాదరణ పొందింది.

Updated Date - 2020-07-22T07:18:22+05:30 IST