‘ఆత్మ నిర్భర్’కు 22,810 కోట్లు
ABN , First Publish Date - 2020-12-10T07:21:32+05:30 IST
కొవిడ్ నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి.. నూతన ఉద్యోగాల సృష్టి కోసం ఇటీవల

కోటి పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ కేంద్రాలు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 9: కొవిడ్ నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి.. నూతన ఉద్యోగాల సృష్టి కోసం ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. మొత్తంగా ఈ పథకానికి రూ. 22,810 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాదికి 1,500 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు రవిశంకర్ ప్రసాద్, సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.
ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు తర్వాత కొత్తగా ఉద్యోగాలు కల్పించిన సంస్థలు, ఉద్యోగుల పీఎఫ్ వాటాను కేంద్రమే భరిస్తుందని సంతోష్ గంగ్వార్ తెలిపారు. దీని ద్వారా 58.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుందన్నారు. అలాగే, దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగాన్ని పెంచే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
‘పీఎం వాణి’ పేరుతో దేశవ్యాప్తంగా పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పబ్లిక్ డేటా ఆఫీసులు (పీడీఓ) నెలకొల్పుతామని, వీటి పరిధిలో పబ్లిక్ డేటా ఆఫీసు అగ్రిగేటర్ (పీడీఓఏ)లు, యాప్ ప్రొవైడర్‌లు పనిచేస్తారని సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోటి పీడీఓలు నెలకొల్పుతామన్నారు. పీడీఓ, పీడీఓఏ, యాప్ ప్రొవైడర్లకు ఎలాంటి రుసుము, రిజిస్ట్రేషన్లు ఉండవన్నారు.