22 ఏళ్ల యువకుడు మృతి.... 65 ఏళ్ల వృద్ధుని మృతదేహం అప్పగింత!
ABN , First Publish Date - 2020-08-11T17:38:09+05:30 IST
మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం బయటపడింది. ఈ ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో 22 ఏళ్ల యువకుడు మృతి చెందగా, 65 ఏళ్ల వృద్ధుని మృతదేహాన్ని ఆ యువకుని కుటుంబానికి అప్పగించారు. ఈ ఉదంతం...

రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం బయటపడింది. ఈ ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో 22 ఏళ్ల యువకుడు మృతి చెందగా, 65 ఏళ్ల వృద్ధుని మృతదేహాన్ని ఆ యువకుని కుటుంబానికి అప్పగించారు. ఈ ఉదంతం వెలుగు చూసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతవైద్యాధికారులు ఆసుపత్రి వైద్యుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన నేపధ్యంలో ఆ యువకుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టారు. అలాగే ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. వివరాల్లోకి వెళితే 22 ఏళ్ల యువకుడిని అనారోగ్యం కారణంగా సంజయ్ గాంధీ ఆసుపత్రిలోని ఐసీయులో చేర్చారు. తరువాత అక్కడి వైద్యులు ఆ యువకుడిని కోవిడ్ కేంద్రానికి పంపారు. మూడు రోజుల తరువాత ఆ యువకుడు మృతి చెందాడంటూ, వైద్యులు ఆ యువకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తూ, మృతదేహాన్ని గుర్తించాలంటూ కబురంపారు. దీంతో వారు ఆసుపత్రికి వచ్చి ఆ మృతదేహాన్ని చూసి, అది ఆ యువకునిది కాదని వైద్యులకు చెప్పారు. కాగా ఆ మృతదేహం 65 ఏళ్ల వృద్ధునిదని గుర్తించారు. ఈ సందర్భంగా ఆ యువకుని తండ్రి కుశావాహ్ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది తమ కుమారుడి కోవిడ్ రిపోర్టును ఇంకా తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బంది తన కుమారునితో పాటు చనిపోయిన మరో వ్యక్తిని ఖననం చేశారని, తమకు నిజం చెప్పడం లేదని యువకుడి తండ్రి మీడియాకు తెలిపారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రేవా డివిజన్ కమిషనర్... ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేశ్ పటేల్‌ను సస్పెండ్ చేశారు.