కోలుకున్న 20 రోజులకు కానిస్టేబుల్‌కు తిరిగి కరోనా!

ABN , First Publish Date - 2020-09-05T13:17:36+05:30 IST

యూపీ రాజధాని లక్నోలో కరోనా నుంచి కోలుకున్న ఒక కానిస్టేబుల్‌కు 20 రోజుల తరువాత తిరిగి కరోనా సోకింది. హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో...

కోలుకున్న 20 రోజులకు కానిస్టేబుల్‌కు తిరిగి కరోనా!

లక్నో: యూపీ రాజధాని లక్నోలో కరోనా నుంచి కోలుకున్న ఒక కానిస్టేబుల్‌కు 20 రోజుల తరువాత తిరిగి కరోనా సోకింది. హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు తిరిగి కరోనా సోకడంతో లోక్‌బంధు ఆసుపత్రిలో చేరారు. బాధితునికి మరోమారు కరోనా సోకడంతో వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజీఎంయూకి చెందిన డాక్టర్ డీ హిమాంశు మాట్లాడుతూ బాధితునికి మరోమారు కరోనా సోకడం యూపీలో ఇది తొలిసారి అని అన్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తనకు తొలిసారి ఆగస్టులో కరోనా సోకిందన్నారు. దీంతో అప్పుడు లోక్‌బంధు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందానని, ఆగస్టు 11న నెగిటివ్ రిపోర్టు రావడంతో డిశ్చార్జ్ చేశారని తెలిపారు.అయితే 20 రోజుల తరువాత జ్వరం వచ్చిందని, వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ సందర్బంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సురేంద్ర కుమార్ మాట్లాడుతూ బాధితునికి హైగ్రేడ్ ఫీవర్ వచ్చిందని, టైఫాయిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందన్నారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు తయారవుతాయని, ఇవి మరోమారు కరోనా సోకకుండా కాపాడతాయన్నారు. అయితే 5 శాతం బాధితులలో యాంటీ బాడీలు తయారు కావడం లేదన్నారు. అందుకే వీరిలో మరోమారు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఇదే కారణంగా ఆ కానిస్టేబుల్‌కు తిరిగి కరోనా సోకివుండవచ్చన్నారు. ప్రస్తుతం బాధితునికి చికిత్స అందిస్తున్నామని, యాంటీబాడీ టెస్ట్ చేయాల్సివుందన్నారు. 

Updated Date - 2020-09-05T13:17:36+05:30 IST