రహదారిపై నగరం

ABN , First Publish Date - 2020-12-29T08:57:24+05:30 IST

అది.. ఢిల్లీ శివారులోని సింఘూ సరిహద్దు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నెల రోజులుగా మహోగ్ర పోరాటం సాగిస్తున్న ప్రాంతం.

రహదారిపై నగరం

పోరుబాటలో 2 లక్షల మంది రైతులు 

ఢిల్లీ శివారులోని సింఘూలో 15 కిలోమీటర్ల మేర రహదారి దిగ్బంధం

నిత్యాన్నదానం.. వైద్య శిబిరాలు


(సింఘూ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

అది.. ఢిల్లీ శివారులోని సింఘూ సరిహద్దు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నెల రోజులుగా మహోగ్ర పోరాటం సాగిస్తున్న ప్రాంతం. 2 లక్షలకు పైగా రైతులు 15 కిలోమీటర్ల మేర రహదారిని దిగ్బంధించిన ఈ ప్రాంతం ఇప్పుడు ఓ నగరాన్ని తలపిస్తోంది. గజగజ వణికిస్తున్న చలిలో రహదారిపై బైఠాయించిన రైతులు తమ సుదీర్ఘ పోరాటానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి వేళల్లో చలి నుంచి తట్టుకునేందుకు గుడారాలు వేసుకున్నారు. రైతులకు ఆహారం అందించేందుకు రోటీ మేకర్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో రోటీ మేకర్‌ గంటకు 500కు పైగా రొట్టెలు తయారు చేస్తోంది. మరోవైపు పప్పు, ఇతర కూరగాయలతో భారీ పాత్రల్లో వంటలు చేస్తున్నారు. రైతుల కోసం పంజాబ్‌, హరియాణా నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్ధాల ను దాతలు ఉచితంగా పంపిస్తున్నారు. మహిళా రైతులు వంటల్లో, ఆహారం వడ్డించడంలో సా యం చేస్తున్నారు. రైతుల కోసం వందలాది వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డాక్టర్లు స్వచ్ఛందంగా చికిత్సలు చేస్తున్నారు. మందులు ఉచితం గా ఇస్తున్నారు.రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 


సీసీటీవీ కెమెరాలతో అప్రమత్తత

ఆందోళన చేస్తున్న ప్రాంతంలో అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా రైతు సంఘాల నేతలు సీసీటీవీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన సభాస్థలి వెనుక ట్రాక్టర్‌ ట్రాలీలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి.. సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వలంటీర్ల మధ్య సమన్వయం కోసం వాకీటాకీలు సైతం వాడుతున్నారు. ఎక్కడైనా రైతులకు అత్యవసర సేవలు అవసరమైనా, ఇతర సమస్యలున్నా.. వాకీటాకీల ద్వారా సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తున్నారు. ఈ ఏర్పాట్లతో ఆ ప్రాంతం నగరాన్ని తలపిస్తోంది. ఆదివారం సెలవు దినం కావడంతో రైతులకు సంఘీభావం తెలపడానికి ఢిల్లీ వాసులు, యువత, విద్యార్థులు, ముఖ్యంగా పంజాబీ కుటుంబాలు సింఘూ సరిహద్దుకు తరలివచ్చాయి. అక్కడక్కడ వారు రైతులకు సేవ చేస్తూ కనిపించారు. విద్యార్థులు, యువత మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి రైతులతో ముచ్చటించారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో అత్యధికంగా పంజాబీలే కావడంతో ప్రార్థనల కోసం సింఘూలో కొన్ని తాత్కాలిక గురుద్వారాలు కూడా వెలిశాయి.

Updated Date - 2020-12-29T08:57:24+05:30 IST