1975 ఎమర్జెన్సీ పెద్ద మోసం!
ABN , First Publish Date - 2020-12-15T07:48:27+05:30 IST
దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని ‘పూర్తి రాజ్యాంగ విరుద్ధమైనది’గా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

‘పూర్తి రాజ్యాంగ వి రుద్ధం’గా ప్రకటించండి
సుప్రీంకోర్టును ఆశ్రయించిన 94 ఏళ్ల సారిన్
న్యూఢిల్లీ, డిసెంబరు 14: దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని ‘పూర్తి రాజ్యాంగ విరుద్ధమైనది’గా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీకి చెందిన వీరా సారిన్ అనే 94 ఏళ్ల వృద్ధురాలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సోమవారం సమ్మతించింది. అయితే ఎమర్జెన్సీ విధించిన 45 ఏళ్ల తర్వాత ఆ ప్రకటన చెల్లుబాటును పరిశీలించడం సుప్రీంకోర్టుకు ‘సాధ్యమా/వాంఛనీయమా’ అనే విషయాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపింది.
ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత పిటిషనర్‌కు ఎలాంటి ఊరట కల్పించగలుగుతామన్నది కూడా పరిశీలించాలని, ఇది తమకు సంక్లిష్ట పరిస్థితి అని పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఎమర్జెన్సీ సమయంలో పాలకులు, అధికారులు తనను, తన భర్తను వేధించారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.