అవినీతి, కాలుష్యం చూడలేక చస్తున్నా!

ABN , First Publish Date - 2020-08-20T07:50:04+05:30 IST

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదనో, తల్లిదండ్రులు కొట్టారనో, మాస్టారు మందలించారనో అలిగి పిల్లలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం! ఆ 16 ఏళ్ల బాలిక కూడా ఆత్మహత్య చేసుకుంది...

అవినీతి, కాలుష్యం చూడలేక చస్తున్నా!

  • తుపాకీతో కాల్చుకొని బాలిక ఆత్మహత్య
  • ప్రధాని మోదీని ఉద్దేశించి 18 పేజీల లేఖ 

బరేలీ, ఆగస్టు 19: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదనో, తల్లిదండ్రులు కొట్టారనో, మాస్టారు మందలించారనో అలిగి పిల్లలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం! ఆ 16 ఏళ్ల బాలిక కూడా ఆత్మహత్య చేసుకుంది. తుపాకీతో తలను కాల్చుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ అమ్మాయిదీ అలకే. ఎవ రి మీదనో కాదు.. మొత్తంగా వ్యవస్థ మీద అలిగింది! దేశంలో అవినీతి పెచ్చుమీరుతోందని.. కాలుష్యం పెరిగిపోతోందని.. అడవులు నాశనమవుతున్నాయని.. అయినవారు ఉన్నా వయసుపైబడ్డ వారు నిరాదరణకు గురవుతున్నారని కలత చెందింది! ఆ మనోవేదనతోనే బలవన్మరణానికి పాల్పడింది.


సమాజానికి చెదలుగా పరిణమించిన అ రుగ్మతలపై ప్రధాని మోదీని ఉద్దేశించి 18 పేజీల లేఖ రాసింది. యూపీ బరేలీకి సమీపంలోని సంభల్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది. అవినీతి, కాలుష్యం, చెట్ల నరికివేత అంశాలపై ప్రధానిని కలిసి చర్చించాలని ఆశపడ్డానని లేఖలో బాలిక పేర్కొంది. జనాభా పెరుగుదలను అరికట్టాలని, టపాసులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, దీపావళి రోజున కాల్చకుండా నిషేధించాలని..  హోలీ రోజుల్లో రసాయనాలతో కూడిన రంగులను వాడకుండా నిషేధించాలని మోదీని ఆమె కోరింది. ‘కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపించే పిల్లలున్న చోట నేను బతకలేను’ అని లేఖలో రాసింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు శుక్రవారం ఆ బాలిక తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 


Read more