ఒకే రోజులో 1,752 కేసులు

ABN , First Publish Date - 2020-04-25T07:47:13+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ కేసులు ఒకేరోజు రికార్డు స్థాయిలో 1,752 పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 23,452కు చేరాయి. ఈనెల 20న ఒకే రోజు 1,540 కేసులు పెరిగాయి.

ఒకే రోజులో 1,752 కేసులు

కరోనా ‘రికార్డు’

దేశంలో మరో 37 మంది రోగుల మృతి..

మొత్తం కేసులు 23,452, మరణాలు 723

కోలుకొన్న రోగుల శాతం 20కి పెరిగింది..

వారంలో మహారాష్ట్రలో కేసులు రెట్టింపు

గుజరాత్‌లో 3 రెట్లు పెరిగాయి..

దేశంలో సగం కేసులు 10 నగరాల్లోనే

తొలి స్థానాల్లో ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌..

మహారాష్ట్ర మంత్రికి కరోనా


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: దేశంలో కరోనా వైరస్‌ కేసులు ఒకేరోజు రికార్డు స్థాయిలో 1,752 పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 23,452కు చేరాయి. ఈనెల 20న ఒకే రోజు 1,540 కేసులు పెరిగాయి. ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉంది. శుక్రవారం దాన్ని దాటిపోయాయి. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 బారినపడిన మరో 37 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 723కి పెరిగింది. ఇప్పటి వరకు 4,813 మంది రోగులు అంటే 20.57 శాతం కోలుకొన్నారు. ఇన్ని రోజుల్లో ఇదే అత్యధికం. యాక్టివ్‌ కేసులు 17,915గా ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం పెరిగింది. ఈవారం మొదట్లో అది 7.5 రోజులు ఉండగా, ఇప్పుడు 10 రోజులైందని వెల్లడించింది. ‘‘గత 14 రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అధికారులు, ప్రజల సమష్టి కృషితో కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగాం’’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా కొత్తగా నమోదైన మరణాల్లో మహారాష్ట్రలో 18, గుజరాత్‌లో 9, ఉత్తరప్రదేశ్‌లో 3 సంభవించాయి.


‘అహ్మదాబాద్‌లో కరోనా కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం నాలుగు రోజులు పడుతోంది. ఇదే కొనసాగితే వచ్చే నెల 15 నాటికి 50 వేలకు, నెలాఖరుకు 8 లక్షలకు చేరతాయి’’ అని అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కమిషనర్‌ విజయ్‌ నెహ్రా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఇప్పటి వరకు అహ్మదాబాద్‌లో 1,639 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఇదే అత్యధికం. 75 మంది చనిపోయారు. 105మంది కోలుకొన్నారు’’ అని ఆయన చెప్పారు. కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయాన్ని 8 రోజులు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. లక్ష్యాన్ని సాధిస్తే వచ్చే నెల 15 నాటికి కేసుల సంఖ్య 50 వేలకు బదులు 10 వేలకు పరిమితం అవుతుందని వివరించారు. మహారాష్ట్రలోని మూడు జిల్లాలపై వైరస్‌ నీడ పడకపోవడం గమనార్హం. వార్దా, భాండారా, గడ్చిరోలి జిల్లాల్లో ఇంతవరకు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీనికి కారణం ముందుజాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టడమేనని అధికారులు అంటున్నారు. కాగా కేరళలోని కోజికోడ్‌లో కరోనా సోకిన 4 నెలల పసిపాప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 


‘ఆయుష్‌’ సాయం

కరోనా వైరస్‌ చికిత్సలో ఆయుష్‌ మందుల ప్రఽబావాన్ని అంచనా వేయడానికి స్వల్పకాలిక పరిశోధనలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర ఆయుష్‌ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆస్పత్రులు, సంస్థలు ముందుకు రావాలని ఆహ్వానించింది. పరిశోధన ప్రాజెక్టు వ్యవధి గరిష్ఠంగా 6 నెలలు ఉండాలని తెలిపింది. ప్రతిపాదనలకు వ్యవస్థీకృత విలువల కమిటీ (ఐఈసీ) అనుమతిస్తే ఆయుష్‌ వైద్యులు, సాంకేతిక మానవ వనరులు, ల్యాబ్‌ దర్యాప్తులు, ఇతర అవసరాల కోసం రూ.10 లక్షల సాయం చేస్తామని తెలిపింది. 


మహారాష్ట్రలో కంటే గుజరాత్‌లో వేగం

దేశంలో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్ర కంటే ఇప్పుడు గుజరాత్‌లో పరిస్థితి ఎక్కువగా కలవరపరుస్తోంది. బుధవారంతో లాక్‌డౌన్‌ 2.0 విధించి వారం అయింది. ఈ సమయంలో గుజరాత్‌లో కేసులు, మరణాలు మూడు రెట్లు పెరిగాయి. ఈనెల 15 వరకు మహారాష్ట్రలో 2,801 కేసులు నమోదయ్యాయి. 22 కల్లా 5,649కు పెరిగాయి. మరణాలు ఈనెల 15 నాటికి 187 ఉండగా, 22 కల్లా 270కు పెరిగాయి. గుజరాత్‌లో పరిస్థితి చూస్తే ఈనెల 15 నాటికి నమోదైన మరణాలు 33. వారం తర్వాత 103కు చేరాయి. ఇదే వ్యవధిలో కేసులు 695 నుంచి 2,407కు పెరిగాయి. దేశంలోని మొత్తం కొవిడ్‌-19 కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి సగానికి దాటిపోయాయి. 170 జిల్లాలను ప్రభుత్వం రెడ్‌ జోన్లుగా గుర్తించగా, వీటిలో ఎక్కువ ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనే ఉన్నాయి. 


మహారాష్ట్ర మంత్రి అవ్హాద్‌కు కరోనా

మహారాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హాద్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తనను కలిసిన పోలీసుల్లో ఒకరికి కరోనా సోకిందని తేలడంతో మంత్రి, కుటుంబ సభ్యులు ఇంటికే పరిమితమయ్యారు. ఈనెల 13న ఆయనకు కొవిడ్‌-19 పరీక్ష నిర్వహించగా ‘నెగెటివ్‌’ వచ్చింది. గురువారం మళ్లీ పరీక్ష చేయగా కరోనా సోకినట్లు తేలింది. యూపీలోని కాన్పూరులో 13 మంది మదర్సా విద్యార్థులకు కొవిడ్‌-19 సోకింది. వైరస్‌ సోకిన తబ్లీగీ సభ్యులతో వారు సన్నిహితంగా మెలిగారు. 

Updated Date - 2020-04-25T07:47:13+05:30 IST