17 మంది జవాన్ల మృతి

ABN , First Publish Date - 2020-03-23T09:31:53+05:30 IST

దండకారణ్యం రక్తమోడింది. కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లపై మావోయిస్టులు కాపుకాచి విరుచుకుపడ్డారు. ఏకంగా 17 మంది జవాన్ల ను పొట్టన పెట్టుకున్నారు.

17 మంది  జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా 

మరో 15 మందికి తీవ్ర గాయాలు

బలగాలపై నక్సల్స్‌ మెరుపుదాడి

దండకారణ్యం రక్తసిక్తం

గ్రెనేడ్స్‌, రాకెట్‌ లాంచర్లతో బీభత్సం

‘ఆపరేషన్‌ ప్రహార్‌’కు ప్రతీకారం

పట్టున్న చోట రెచ్చిపోయిన నక్సల్స్‌


చింతూరు/దుమ్ముగూడెం/రాయ్‌పూర్‌, మార్చి 22: దండకారణ్యం రక్తమోడింది. కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లపై మావోయిస్టులు కాపుకాచి విరుచుకుపడ్డారు. ఏకంగా 17 మంది జవాన్ల ను పొట్టన పెట్టుకున్నారు. మరో 15 మంది జవాన్లు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇది జరిగింది శనివారం సాయంత్రమే అయినా బాహ్య ప్రపంచానికి తెలిసింది మాత్రం ఆదివారమే. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు అదునుచూసి జవాన్లను గట్టి దెబ్బ కొట్టారు. ఈ పరిణామంతో ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఉలిక్కి పడింది.


సుక్మా జిల్లా, చింతల్‌నార్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమచారంతో భద్రతా బలగాలు శుక్రవారమే కూంబింగ్‌కు వెళ్లాయి. సుక్మా జిల్లా పరిధిలోని బుర్కాపాల్‌, చింతల్‌నార్‌ పోలీసు క్యాంపుల్లో విధులు నిర్వర్తిస్తున్న డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, గ్రేహౌండ్స్‌ బలగాలు మొత్తం 251 మంది జవాన్లు కాలి నడకన శనివారం సాయంత్రానికి ఎలమగూడ ప్రాంతానికి చేరుకున్నారు. జవాన్ల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు పక్కా ప్రణాళికతో ముప్పేట దాడికి దిగారు. దీంతో జవాన్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెనువెంటనే తేరుకుని మావోయిస్టులపై ఎదురు కాల్పులకు దిగారు. పక్కా ప్రణాళికతో ఉన్న మావోయిస్టులు గుట్టలపై అప్పటికే ఏర్పాటు చేసుకున్న సురక్షిత ప్రదేశాల నుంచి గ్రెనేడ్స్‌, రాకెట్‌ లాంచర్లు, అత్యాధునికి ఆయుధాలతో జవాన్లపై విరుచుకుపడ్డారు.


దీంతో మావోయిస్టులదే పైచేయిగా మారింది. దాదాపు 2 గంటలపాటు ఇరుపక్షాల నడుమ హోరా హోరీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. వీరిలో ఎస్టీఎఫ్‌ జవాన్లు ఐదుగురు, డీఆర్‌జీ జవాన్లు 12 మంది ఉన్నారు. మరో 15 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎస్టీఎఫ్‌ జవాన్లు నలుగురు, డీఆర్‌జీ జవాన్లు 10 మంది ఉన్నారు. గాయపడిన జవాన్లను రాయపూర్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, భద్రతా బలగాలకు చెందిన ఏకే 47 సహా మొత్తం 16 అత్యాధునిక ఆయుధాలను మావోయిస్టులు లూటీ చేశారని డీజీపీ దుర్గేశ్‌ మాధవ్‌ తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యను ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌ బగేల్‌ తీవ్రంగా ఖండించారు. రాయపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను సీఎం, మాజీ సీఎం రమణసింగ్‌ పరామర్శించారు. 


ఆపరేషన్‌ ప్రహార్‌కు ప్రతీకారంగానే!

ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఇటీవల ‘ఆపరేషన్‌ ప్రహార్‌’తో మావోయిస్టులను అణచివేసే కార్యక్రమం చేపట్టింది. దీంతో జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు. అయితే ఆపరేషన్‌ ప్రహార్‌కు ప్రతీకారంగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఛత్తీ్‌సగఢ్‌లో ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటికప్పుడు జవాన్ల సంచారాన్ని పసిగట్టి, పక్కా ప్రణాళికతో జవాన్లను దెబ్బ కొట్టడం బెటాలియన్‌ పని. కాగా, సుక్మా కేంద్రంగా ఏర్పడ్డ మావోయిస్టు బెటాలియన్‌కు మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన ఇడమ నాయకత్వం వహిస్తున్నాడు. తాజా ఘటనకు వ్యూహం రచించింది ఇడమేనని పోలీసులు భావిస్తున్నారు.


ఇక్కడ నక్సల్స్‌దే పైచేయి

చింతల్‌నార్‌.. ఛత్తీ్‌సగఢ్‌లోని మావోయిస్టులకు ఈ ప్రాంతం కేంద్ర బిందువు, ఇక్కడ మావోయిస్టులు గట్టి పట్టు సాధించారు. మూడంచెల గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టుల ప్రత్యేక బెటాలియన్లలో మొదటి బెటాలియన్‌ ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని సమాచారం. అంతేకాదు దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ విస్తరించిన నాటి నుంచి ఇప్పటివరకు చింతల్‌నార్‌లో పలుమార్లు మావోయిస్టులు పైచేయి సాధించిన ఘటనలున్నాయి. 1988 జులైలోనే ఈ ప్రాంతంలో తొలిసారి ఎదురుకాల్పులు జరిగాయి. అప్పట్లో మావోయిస్టులే పైచేయి సాధించారు. 2010 మేలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటన కూడా ఇక్కడే చోటుచేసుకుంది.

Updated Date - 2020-03-23T09:31:53+05:30 IST