ఎంపీలో బలపరీక్ష : భోపాల్‌లో 144 సెక్షన్

ABN , First Publish Date - 2020-03-15T22:29:12+05:30 IST

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష మరి కొద్ది గంటల్లోనే జరుగనుండటంతో భోపాల్ జిల్లా యంత్రాంగం రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో ..

ఎంపీలో బలపరీక్ష : భోపాల్‌లో 144 సెక్షన్

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష మరి కొద్ది గంటల్లోనే జరుగనుండటంతో భోపాల్ జిల్లా యంత్రాంగం రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. బహిరంగ ప్రదేశాల్లో ఐదు లేదా అంతకు మించి వ్యక్తులు గుమిగూడటాన్ని నిషేధించింది. 16వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 13 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సోమవారం బలపరీక్ష జరుగుతుందని గవర్నర్ లాల్జీ టాండన్ చెప్పిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.


దీనికి ముందు, బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలుసుకుని అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరింది. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో గోపాల్ భార్గవ, శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు. '22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో తక్షణం బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు ఒక లేఖ సమర్పించాం. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే కమల్‌నాథ్ సర్కార్ తమ బలం నిరూపించుకోవాలి' అని మాజీ సీఎం శివరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కమల్‌నాథ్ సర్కార్ మైనారిటీలో పడినందున రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించే హక్కుకానీ, నిర్ణయాలు తీసుకునే హక్కు కానీ వారికి లేదని అన్నారు. తొలుత అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈనెల 10న రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైంది.

Updated Date - 2020-03-15T22:29:12+05:30 IST