యూపీ ప్రభుత్వంపై మండిపడుతూ 104 విశ్రాంత ఐఏఎస్‌ల లేఖ
ABN , First Publish Date - 2020-12-30T15:12:58+05:30 IST
బలవంతపు మత మార్పిళ్లపై ఆర్డినెన్స్ చేసి, యోగి ప్రభుత్వం యూపీని ద్వేష రాజకీయాలకు సెంటర్‌గా మార్చేసిందని విశ్రాంత ఐఏఎస్
లక్నో : బలవంతపు మత మార్పిళ్లపై ఆర్డినెన్స్ చేసి, యోగి ప్రభుత్వం యూపీని ద్వేష రాజకీయాలకు సెంటర్‌గా మార్చేసిందని విశ్రాంత ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇటీవలే యోగి ప్రభుత్వం బలవంతపు మత మార్పిళ్లను నిరోధిస్తూ చట్టం తీసుకొచ్చింది. దీనిపై తీవ్రంగా మండిపడుతూ ఏకంగా 104 మంది విశ్రాంత ఐఏఎస్‌లు ప్రభుత్వానికి లేఖ రాశారు. జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి నిరుపమా రావు, ప్రధాని మాజీ సలహాదారు నాయర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. చట్ట విరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. సీఎం యోగితో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మాజీ ఐఏఎస్‌లు చురకలంటించారు.
ఉత్తరప్రదేశ్ గంగా జమునా తెహజీబ్‌కు మూల స్థానమని, అలాంటి వాతావరణమున్న యూపీని ద్వేష రాజకీయాలతో ముంచెత్తుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలను వివిధ వర్గాల కింద విభజించారని, లేనిపోని మూర్ఖపు వాదనలను రాష్ట్రంలోకి తీసుకొచ్చి, ప్రభుత్వ వ్యవస్థ మొత్తాన్ని విషంగా మార్చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని యువతపై అధికార యంత్రాంగం దారుణమైన, ఘోరమైన హింసలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మానాన తమని స్వేచ్ఛగా బతనీయండని భారత ప్రజలు కోరుకుంటున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారులు లేఖలో పేర్కొన్నారు.
