ఒక్క రోజే 1,007 మంది మృతి

ABN , First Publish Date - 2020-08-11T07:25:02+05:30 IST

దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వైరస్‌ బారినపడి తాజాగా 1,007 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో వెయ్యిపైగా మరణాలు నమోదవడం ఇదే తొలిసారి...

ఒక్క రోజే 1,007 మంది మృతి

  • మహారాష్ట్రలోనే వైర్‌సకు 390 మంది బలి
  • నాలుగో రోజూ 60 వేలపైగా కేసులు
  • వారంలో 3,300 మరణాలు..
  • 4.5 లక్షల కరోనా కేసులు
  • వైద్య సిబ్బంది క్వారంటైన్‌ గడువు 
  • ఆన్‌ డ్యూటీగా పరిగణింపు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వైరస్‌ బారినపడి తాజాగా 1,007 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో వెయ్యిపైగా మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 62,064 మందికి వైరస్‌ సోకింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 2,400 కేసులు తగ్గినా.. మరణాలు 146 పెరిగాయి. వరుసగా నాలుగో రోజూ 60 వేల పైగా కేసులు వచ్చాయి. మొత్తం బాధితుల సంఖ్య 22 లక్షలు దాటింది. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 54,859 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య 15 లక్షలను మించింది. రికవరీ రేటు 69.33 శాతానికి సమీపించిందని, మరణాల రేటు 2కు తగ్గిందని కేంద్రం పేర్కొంది.
గత వారం భయంకరం..

దాదాపు 6,300 మరణాలు.. నాలుగున్నర లక్షలకు పైగా కేసులు.. దేశంలో గత వారం విజృంభణను చాటే అంకెలివి. ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న భారత్‌లో.. గత వారం అమెరికా, బ్రెజిల్‌ తర్వాత అత్యధిక మరణాలు రికార్డయ్యాయి. కొత్త కేసుల్లో 80 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటిస్తుండగా, మిగతా రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం ఎడియూరప్ప డిశ్చార్జి అయ్యారు. మధ్యప్రదేశ్‌ వైద్య విద్య మంత్రి విశ్వాస్‌ సారంగ్‌, అసోం డీజీపీ భాస్కర్‌ జ్యోత్‌ మహంతకు వైరస్‌ నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో  కొత్తగా 390 మంది చనిపోయారు.  దేశంలో 42శాతం మరణాలు ఈ రాష్ట్రానివే. ముంబైలో రెండో దశ సీరో సర్వే ప్రారంభమైంది. ఢిల్లీలో తాజాగా 707 కేసులు నమోదు కాగా.. 20 మంది చనిపోయారు. కోజికోడ్‌ విమాన దుర్ఘటన సహాయ చర్యల్లో పాల్గొన్న మలప్పురం కలెక్టర్‌ సహా 600మందిని క్వారంటైన్‌కు పంపారు. తమిళనాడులో 5914 మందికి కరోనా సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,815కు పెరిగింది.  కర్ణాటకలో సోమవారం 4,267 మందకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.   


ఆన్‌ డ్యూటీగా..

కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యారోగ్య సిబ్బంది ‘క్వారంటైన్‌’ గడువును ఆన్‌ డ్యూటీగా గుర్తిస్తూ కేంద్రం ఆదేశాలిచ్చింది.  క్వారంటైన్‌ గడువును 14 రోజులకు పెంచడం పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. 

Updated Date - 2020-08-11T07:25:02+05:30 IST