దీపావళి ముందు ఘోర ప్రమాదం .. 10 మంది దుర్మరణం...
ABN , First Publish Date - 2020-11-14T04:16:18+05:30 IST
40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు....
శివపురి: దీపావళి ముందు మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు ఓ సీనియర పోలీస్ అధికారి వెల్లడించారు. దోడి గ్రామానికి చెందిన కొందరు షియోపూర్ జిల్లా ఉనావాద్‌లో జరిగిన ఓ మత కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7:15 సమయంలో... వేగంగా వెళ్తున్న వ్యాను ఓ ఇరుకైన రోడ్డులో ప్రవేశించగానే ఈ ప్రమాదం జరిగినట్టు శివపురి ఎస్పీ రాజేశ్ సింగ్ చాందేల్ వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. క్షతగాత్రులను పోహ్రి, శివపురి జిల్లా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.