ఏ కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి..?

ABN , First Publish Date - 2020-10-03T21:20:30+05:30 IST

కొవ్వు శరీరానికి ప్రధాన శక్తి వనరు. ఆహారంలోని కొవ్వు కొన్ని విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడం, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా కొవ్వు కావాలి. ఆహారం నుంచి లభించే

ఏ కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి..?

ఆంధ్రజ్యోతి(03-10-2020)

ప్రశ్న: కొవ్వు పదార్థాల్లో మంచి, చెడు అని ఉన్నాయా? అవేంటో ఎలా తెలుస్తాయి?


- తులసి, విజయవాడ


డాక్టర్ సమాధానం: కొవ్వు శరీరానికి ప్రధాన శక్తి వనరు. ఆహారంలోని కొవ్వు కొన్ని విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడం, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు కూడా కొవ్వు కావాలి. ఆహారం నుంచి లభించే కొవ్వులలో రసాయనిక భేదాలను బట్టి మంచి, చెడులుగా పిలుస్తారు. కొవ్వులలో అత్యంత ప్రమాదకరమైనవి ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో హానికరమైన LDL కొలెస్ట్రాల్ పెరిగి ప్రయోజనకరమైన HDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారంలో, ఫాస్ట్ ఫుడ్స్‌లో, డాల్డా, వనస్పతి, మార్జరీన్ లాంటివి వాడి తయారు చేసే బేకరీ ఫుడ్స్‌లోనూ ఇవి ఉంటాయి. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనే రకం కొవ్వులు మధ్యస్థమైనవి. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా జంతు సంబంధిత ఆహారం అంటే - పాలు, వెన్న, నెయ్యి, చికెన్, మటన్ తదితర ఆహారాల నుంచి లభిస్తాయి. పరిమితిలో తీసుకుంటే వీటి వలన ఇబ్బంది ఉండదు. ఇక మంచి కొవ్వులు అంటే పాలీఅన్‌శాచ్యురేటెడ్, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్. గింజలు, పప్పుల నుంచి వచ్చే నూనెలలో ఉంటాయి. ఆహారంలో అధిక భాగం మంచి కొవ్వులు, కొంత వరకు మధ్యస్థ కొవ్వులను తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్‌ను మాత్రం దూరంగా ఉంచాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-10-03T21:20:30+05:30 IST