‘బుధ బౌల్ డైట్’ అంటే..?
ABN , First Publish Date - 2020-07-18T18:09:10+05:30 IST
మా అమ్మాయి ఈ మధ్య ‘బుధ బౌల్’ అనే డైట్ ఫాలో అవుతోంది. వయసు పైబడుతున్న నేను కూడా అలాంటి డైట్ తీసుకోవచ్చా? ఎలాంటి ఆహారపదార్థాలు ఇందులో ఉపయోగించాలి?

ఆంధ్రజ్యోతి(18-07-2020)
ప్రశ్న: మా అమ్మాయి ఈ మధ్య ‘బుధ బౌల్’ అనే డైట్ ఫాలో అవుతోంది. వయసు పైబడుతున్న నేను కూడా అలాంటి డైట్ తీసుకోవచ్చా? ఎలాంటి ఆహారపదార్థాలు ఇందులో ఉపయోగించాలి?
- వరలక్ష్మి, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: బుధ బౌల్ అంటే ఒక గిన్నెలోనే మొత్తం ఆహారం ఉంటుంది. పూటకి ఒక బౌల్ తింటే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువే. సాధారణంగా ఇవి వెజిటేరియన్ బౌల్స్. నార్మల్ రూమ్ టెంపరేచర్లో గానీ, చల్లగా గానీ తింటారు. బుధ బౌల్స్ గొప్పదనం ఏమిటంటే ఒకేసారి అన్ని పోషకాలు లభిస్తాయి. వీటిని ప్లాన్ చేయడం, తయారు చేయడం కూడా సులువే. ఈ డైట్లో ఎక్కువగా సహజంగా లభించే ఆహర పదార్ధాలు వాడతారు. ఇక్కడ మీకు మూడు రెసిపీస్ ఇస్తాను. వాటిని ట్రై చెయ్యండి. ఇది బరువు తగ్గడానికి ఒక పద్ధతి, సో ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. అయితే ముందు జాగత్తగా ఆరోగ్య సమస్యలు ఏమి లేవని నిర్ధారించుకోవాలి. పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవాలి.
బ్రేక్ఫాస్ట్ బౌల్:
కావలసిన పదార్ధాలు : అర కప్పు మొలకలు, ఒక ఉల్లి కాడ, ఒక టొమాటో, కొత్తిమీర, ఒక క్యారెట్, చిల్లీ సాస్, పల్లి చట్నీ, ఉప్పు, కారం, నిమ్మరసం. బొప్పాయి ముక్కలు, బాదం పలుకులు ఎనిమిది నానబెట్టినవి.
తయారీ: ఒక పాత్రలో చిల్లీ సాస్ రాయాలి. ఒక పక్కన మొలకలు, దాని పక్కనే టొమాటో ముక్కలను చక్రాలుగా కట్ చేసి పెట్టాలి. క్యారెట్ని ఉడకబెట్టి పొడుగు ముక్కలుగా కోసి టొమాటో ముక్కల పక్కన అరేంజ్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు, కారం, నిమ్మరసం, సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, చిల్లీ సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఆహర పదార్ధాల పైన చల్లుకోవాలి. అలాగే నాన బెట్టిన బాదం పలుకులను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బొప్పాయి ముక్కలను పెట్టుకోవాలి. పల్లీల చట్నీని బౌల్లో వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ బౌల్ రెడీ.
లంచ్ బౌల్:
కావలసిన పదార్ధాలు : అరకప్పు అన్నం , పావు కప్పు ఉప్పు వేసి ఉడకబెట్టిన బొబ్బర్లు, పుదీనా లేదా కొత్తిమీర లేదా గోంగూర చట్నీ, కొబ్బరి ముక్కలు, పావుకప్పు గడ్డ పెరుగు, సరిపడా ఉప్పు, చిటికెడు జీలకర్ర, టొమాటో ముక్కలు, ఒక కట్ట పాలకూర (ఉప్పు, కారం, పసుపు వేసి నూనెలో వేగించినది), ఆపిల్ ముక్కలు.
తయారీ: ఒక పాత్రలో కొద్దిగా పెరుగు రాయాలి. మధ్యలో అన్నం ముద్దలా పెట్టాలి. అన్నంకు ఒకవైపు బొబ్బర్లు, మరో వైపు టొమాటో ముక్కలు అరేంజ్ చేసుకోవాలి. వేగించిన పాలకూర అన్నం పైన పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు చుట్టూ అమర్చుకోవాలి. తరువాత ఆపిల్ ముక్కలు అమర్చుకోవాలి. మిగిలిన పెరుగు, పుదీనా చట్నీ పైన చల్లుకోవాలి.
డిన్నర్ బౌల్:
కావలసిన పదార్ధాలు: గుమ్మడి కాయ కూర, నానబెట్టి ఉడికించిన సెనగలు, క్యాలీఫ్లవర్ తొడిమెలు (వీటిని ఉప్పు వేసిన వేడి నీళ్లలో రెండు నిమిషాలు ఉడికించాలి) జామకాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి ఉప్పు, నువ్వుల నూనె.
తయారీ: ఒక గిన్నె తీసుకొని మధ్యలో గుమ్మడికాయ కూర ఉంచాలి. దాని చుట్టూ సెనగలు అమర్చుకోవాలి. క్యాలీఫ్లవర్ తొడిమలు ఒకవైపు, జామకాయ ముక్కలు ఒక వైపు పెట్టాలి. నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ రెసిపీలను మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు.
డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్
drjanakibadugu@gmail.com