బోర్లా పడుకోబెట్టడం మేలు!

ABN , First Publish Date - 2020-04-21T16:30:05+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం! జ్యూయిష్‌ మెడికల్‌ సెంటర్‌లో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న ఓ 40 ఏళ్ల కరోనా బాధితుడి పరిస్థితి ఉన్నట్టుండి దిగజారింది

బోర్లా పడుకోబెట్టడం మేలు!

ఆంధ్రజ్యోతి(21-04-2020)

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం! జ్యూయిష్‌ మెడికల్‌ సెంటర్‌లో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న ఓ 40 ఏళ్ల కరోనా బాధితుడి పరిస్థితి ఉన్నట్టుండి దిగజారింది. దాంతో పక్కనే ఉన్న వైద్యురాలు బాధితుడి పరిస్థితి విషమంగా ఉందనీ, లైఫ్‌ సపోర్ట్‌ పెట్టవలసిన అవసరం ఉందా? అంటూ కంగారుగా కరోనా చికిత్స చేసే ప్రధాన వైద్యురాలు మంగళా నర్సింహన్‌కు ఫోన్‌ చేసి అడిగింది. అప్పుడా ప్రధాన వైద్యురాలు.... ‘‘నేను అక్కడికి చేరుకునే లోపు బాఽధితుడిని బోర్లా పడుకోబెట్టి చూడండి. పరిస్థితి అదుపులోకి రావచ్చు’’ అని సలహా ఇచ్చారు.


ఆ సలహా పాటించిన తర్వాత వైద్యురాలు మంగళా నర్సింహన్‌కు ఇంటెన్సివ్‌ కేర్‌కు వెళ్లవలసిన అవసరం పడలేదు. ఆవిడ చెప్పిన చిట్కా పని చేసింది. కరోనా వైర్‌సతో తీవ్రంగా బాధపడుతున్న వారి విషయంలో ‘ప్రోన్‌ పొజిషనింగ్‌’ అనే పొట్ట మీద బోర్లా పడుకోబెట్టే విధానాన్ని అనుసరిస్తే, వారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ఆక్సిజన్‌ శాతం పెరుగుతున్నట్టు వైద్యులు గమనించారు. ‘‘ఇలా చేయడం ద్వారా కరోనా బాధితుల ప్రాణాలను నూటికి నూరు శాతం కాపాడుకోవచ్చని చెప్పగలం’’ అంటున్నారు డాక్టర్‌ మంగళ. ఈవిడ న్యూయార్క్‌లో 23 ఆస్పత్రులకు అనుబంధంగా పని చేస్తున్న నార్త్‌వెల్‌ హెల్త్‌ అనే ఆరోగ్య సంరక్షణ సంస్థలో క్రిటికల్‌ కేర్‌ రీజనల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. 


కరోనా బాధితులు ప్రధానంగా ‘ఎక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌’ (ఎ.ఆర్‌.డి.ఎ్‌స)తో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోనియా మరణాలకూ ఈ సమస్యే కారణం. ఎ.ఆర్‌.డి.ఎ్‌సతో బాధపడుతూ, వెంటిలేటర్ల మీద ఉన్న రోగులను బోర్లా పడుకోబెడితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు తగ్గినట్టు తెలిపే ఓ వైద్య అధ్యయనం సరిగ్గా ఏడేళ్ల క్రితం ‘న్యూ ఇంగ్లండ్‌ జోర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైంది. అప్పటి నుంచి అమెరికాలో వైద్యులు వేర్వేరు సందర్భాల్లో ఎ.ఆర్‌.డి.ఎస్‌ రోగులను బోర్లా పడుకోబెట్టే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.


ఇదే సూత్రం కరోనా బాధితుల్లోనూ సత్ఫలితాలను ఇస్తుండడంతో ఈ విఽధానం మీద వారికి నమ్మకం రెట్టింపైంది. వెల్లకిలా పడుకోబెట్టినప్పుడు శరీర బరువు కారణంగా ఊపిరితిత్తుల్లోని కొన్ని భాగాలు కుంచించుకుపోతాయి. బోర్లా పడుకోబెట్టడం మూలంగా అలా కుంచించుకుపోయిన ప్రాంతాలు తెరుచుకుని, ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. కాబట్టి ‘కొవిడ్‌ - 19’ బాధితుల పరిస్థితి ఉన్నపళాన విషమిస్తే, బోర్లా పడుకోబెట్టడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు అంటున్నారు.

Updated Date - 2020-04-21T16:30:05+05:30 IST