మాస్కు వల్ల చర్మ సమస్యలు.. ఇలా పరిష్కరించుకోండి..

ABN , First Publish Date - 2020-11-24T16:40:17+05:30 IST

కొవిడ్‌ కాలం, చలికాలం... ప్రస్తుతం ఈ రెండింటి నుంచి రక్షణ అవసరమే! మరీ ముఖ్యంగా చర్మానికి ఈ సమయంలో రెట్టింపు రక్షణ కావాలి. మాస్క్‌ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులనూ, శీతాకాలంతో తలెత్తే కొత్త సమస్యలనూ తెలివిగా పరిష్కరించుకోవాలని అంటున్నారు చర్మ నిపుణులు.

మాస్కు వల్ల చర్మ సమస్యలు.. ఇలా పరిష్కరించుకోండి..

చర్మం చమక్కు.. 


ఆంధ్రజ్యోతి (24-11-2020): కొవిడ్‌ కాలం, చలికాలం... ప్రస్తుతం ఈ రెండింటి  నుంచి రక్షణ అవసరమే! మరీ ముఖ్యంగా  చర్మానికి ఈ సమయంలో రెట్టింపు రక్షణ కావాలి. మాస్క్‌ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులనూ, శీతాకాలంతో తలెత్తే కొత్త సమస్యలనూ తెలివిగా పరిష్కరించుకోవాలని అంటున్నారు చర్మ నిపుణులు. 


మాస్క్‌ మన జీవితంలో భాగంగా మారింది. అయితే రోజంతా మాస్క్‌ ధరించడం వల్ల, పీల్చి వదిలే ఊపిరి కారణంగా మాస్క్‌ లోపలి ఉష్ణోగ్రత, తేమ పెరిగిపోతాయి. ఫలితంగా చెమట పట్టడం, దాంతో మొటిమలు ఏర్పడతాయి. ఇంతేకాకుండా మాస్క్‌ అంచులు ముక్కు, చెంపలకు రుద్దుకుంటూ ఆ ప్రదేశాల్లో ఇరిటేషన్‌, మొటిమలు మొదలవుతాయి. చెవులకు తగిలించుకునే మాస్క్‌ హ్యాంగర్స్‌ కూడా చర్మానికి ఒరుసుకుని మొటిమలను కలిగిస్తాయి. మాస్క్‌ను మరీ బిగుతుగా ధరించడం వల్ల ముక్కు మీది చర్మం ఒరుసుకుని, ఆ ప్రదేశంలో పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. అయితే మాస్క్‌ కారణంగా ఈ చర్మ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే...


గంటకు ఒకసారైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి మాస్క్‌ తొలగించి, కొద్దిసేపు తాజా గాలి ఆడేలా చూసుకోవాలి.

పాలీస్టర్‌, జార్జెట్‌, నైలాన్‌ మొదలైన సింథటిక్‌ మెటీరియల్స్‌కు బదులు కాటన్‌తో తయారు చేసిన మాస్క్‌లనే ఎంచుకోవాలి.

మాస్క్‌లను ప్రతి రోజూ తప్పనిసరిగా ఉతికి, ఎండలో ఆరబెట్టి ధరించాలి.


వీటితో నిగారింపు తాత్కాలికమే!

ఇంట్లో లేదా బ్యూటీపార్లర్‌లో పాటించే చర్మ సౌందర్య చిట్కాలు, చికిత్సలతో కలిగే చర్మపు నిగారింపు, మెరుపులు తాత్కాలికం. పైగా చర్మపు తత్వాన్ని తెలుసుకోకుండా ఎక్కడో చదివిన, విన్న చిట్కాలు పాటించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగే వీలుంది. జిడ్డు చర్మం కలిగినవాళ్లు మీగడ, పొడిచర్మం కలిగినవాళ్లు ముల్తానీ మట్టిని వాడితే చర్మానికి మరింత హాని కలుగుతుంది. అలాగే చేతులకు పులిపిరులు కలిగి ఉన్న బ్యుటీషియన్లతో ఫేషియల్‌, త్రెడింగ్‌ లాంటివి చేయించుకోవడం వల్ల పులిపిరులు మనకూ సోకే ప్రమాదం ఉంటుంది. ఫేషియల్‌ లాంటివి ఫీల్‌గుడ్‌ చికిత్సలు. వీటితో తాత్కాలిక ప్రయోజనంతో పాటు, మనసు కూడా సాంత్వన పొందుతుంది. కాబట్టి ఈ చికిత్సలను చేయించుకోవడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటాం. అయితే ఈ ట్రీట్మెంట్ల కోసం శుభ్రత పాటించే అనుభవజ్ఞులైన బ్యుటీషియన్లనే ఎంచుకోవాలి. అలాగే చర్మపు తత్వానికి తగిన సౌందర్య చిట్కాలు, చికిత్సలూ అనుసరించాలి.


ఆహారంతో చర్మ సౌందర్యం

చర్మ ఆరోగ్యం ఆహారం ద్వారానే సాధ్యం. విటమిన్లు, మినరల్స్‌ సరిపడా అందే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం...

వీలైనంత ఎక్కువగా పచ్చి కూరగాయలు తినాలి. 

ప్రొటీన్‌, ఐరన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ పుష్కలంగా ఉండే మొలకలను ఆహారంలో చేర్చుకోవాలి. 

ఒమేగా3 ఫ్యాటీయాసిడ్లు ఉండే పదార్థాలు తీసుకోవడం ఎంతో అవసరం. 

చేపలు, బాదం, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, సబ్జా, వేరుసెనగ పప్పులు ఎక్కువగా తీసుకోవాలి.

రెండు రకాల పండ్ల్లు, రెండు రకాల కూరగాయలు ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

నిమ్మరసంలో విటమిన్‌ సి ఎక్కువ కాబట్టి, చర్మ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నిమ్మరసం తాగాలి. 

విటమిన్‌ ఎ, బీటాకెరోటిన్‌ మొదలైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండే క్యారట్‌, బీట్‌రూట్‌, టొమాటో జ్యూస్‌లను ప్రతి రోజూ మార్చి మార్చి తీసుకోవడం అవసరం. 

సరిపడా నిద్ర, చెమట పట్టేలా వ్యాయామం... కూడా చర్మం ఆరోగ్యానికి అవసరం!


అన్నీ ఆరోగ్యంగా పని చేయాలంటే..

శరీరంలోని ప్రతి అవయవానికీ విటమిన్‌ డి అత్యవసరం. వెంట్రుకలు, చర్మం, కండరాలు, ఎముకలు... అన్నీ సమర్థంగా, ఆరోగ్యంగా పని చేయాలంటే విటమిన్‌ డి సరిపడా అందాలి. కానీ ఈ విటమిన్‌ లోపం సర్వసాధారణమైపోయింది. ఎండ తగలకపోవడం, డి విటమిన్‌ లభించే ఆహారం సరిపడా తీసుకోకపోవడం.... ఇలా విటమిన్‌ డి లోపానికి బోలెడన్ని కారణాలు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే నెలల తరబడి పరిమితమైపోవడం మూలంగా ఎక్కువ మందిలో విటమిన్‌ డి లోపం ఏర్పడుతోంది. అయితే విటమిన్‌ డి సరిపడా అందడం కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. కనీసం 50ు  చర్మానికి ఎండ తగిలినప్పుడే విటమిన్‌ డి సరిపడా ఉత్పత్తి అవుతుంది. అయితే ధరించే దుస్తులు, హెల్మెట్ల కారణంగా సూర్యరశ్మి సరిపడా శరీరానికి సోకే వీలు లేదు కాబట్టి విటమిన్‌ డి లోపం ఏర్పడుతుంది. వెంట్రుకలు ఊడిపోవడం, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్లనొప్పులు లాంటి లక్షణాలు విటమిన్‌ డి లోపాన్ని తెలిపేవే! ఈ లోపం తలెత్తకుండా ఉండాలంటే... 


మాంసాహారంలో విటమిన్‌ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చేపలు, గుడ్లు, మాంసం... తరచుగా తీసుకుంటూ ఉండాలి.

శాకాహారులు తరచుగా మష్రూమ్స్‌ తీసుకుంటూ ఉండాలి

విటమిన్‌ డి కలిసిన పదార్థాలు (కార్న్‌ఫ్లేక్స్‌, వంటనూనెలు) ఎంచుకోవాలి

విటమిన్‌ డి డైలీ సప్లిమెంట్స్‌ కూడా తీసుకోవచ్చు


చర్మం పొడిబారకుండా..

చలికాలంలో చర్మంలోని తేమ ఆవిరై పొడిగా మారుతుంది. కాబట్టి ఈ తేమ ఆవిరవకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్లను రాసుకోవాలి. ఇవి చర్మం మీద పొరలా ఏర్పడి చర్మం నుంచి తేమ ఆవిరవకుండా అడ్డుపడతాయి. అలాగే చలికాలం సాధారణ సబ్బులకు బదులుగా మైల్డ్‌ సోప్స్‌ వాడుకోవాలి. అలాగే లిక్విడ్‌ క్లీన్సర్లు కూడా వాడుకోవచ్చు. అలాగే చలిని తట్టుకోవడం కోసం వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం కూడా సరికాదు. వేడి నీళ్లు చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీళ్లనే స్నానానికి ఉపయోగించాలి. 


కురులను ఇలా కాపాడుకుందాం...

ఈ కాలంలో వెంట్రుకల్లోని తేమ ఆవిరై పొడిబారతాయి. కాబట్టి చలి కాలం మైల్డ్‌ షాంపూలే వాడాలి. తలస్నానానికి గంట ముందు నూనె రాసుకుని, మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలకు సరిపడా తేమ అందుతుంది. అలాగే తడి జుట్టుకు కండిషనర్‌ అప్లై చేసుకోవాలి. ఈ కాలంలో చుండ్రు సమస్య ఎక్కువ. దీనికి యాంటీడాండ్రఫ్‌ షాంపూ ఎంచుకోవాలి. స్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడుకోవాలి. ప్రతిరోజూ తలస్నానం చేసే అలవాటు ఉన్నవాళ్లు చలికాలంలో వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. 


మొటిమలు, చుండ్రు, పిగ్మెంటేషన్‌ లాంటి సమస్యలకు అంతర్గత కారణాలు ఉంటాయి. హార్మోన్‌ హెచ్చుతగ్గులు, ఒత్తిడి, ఇతరత్రా ఆరోగ్య కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దడం ద్వారా ఈ సమస్యలను సమూలంగా అదుపులోకి తీసుకురావచ్చు. అంతేకానీ సౌందర్య చికిత్సలను ఆశ్రయించడం సరికాదు. 


విటమిన్‌ డి పరీక్ష! 

ప్రతి ఆరు నెలలకోసారి విటమిన్‌ డి లోపాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. లోపం ఉన్నవాళ్లు మూడు నెలల పాటు క్రమంతప్పకుండా సప్లిమెంట్లను వాడి, ఆ తర్వాత నుంచి నెలకు ఒకసారి చొప్పున రెండేళ్ల పాటు వాటిని కొనసాగించవలసి ఉంటుంది. 


అర్టికేరియా!

ఇది చర్మపు అలర్జీ. కొవిడ్‌ సోకిన వారిలో ఈ చర్మ సమస్య వ్యాధి లక్షణంగా బయల్పడే వీలుంది. కాబట్టి అకారణంగా చర్మపు దురద, దద్దుర్లు తలెత్తితే వైద్యుల దృష్టికి తప్పక తీసుకువెళ్లాలి.


కేస్‌ స్టడీ

సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లలో కనిపించే చిట్కాలు గుడ్డిగా అనుసరించడం సరికాదు. మొటిమలకు టూత్‌పేస్ట్‌, వెల్లుల్లి రసం లాంటివి రాసుకుని చర్మం మీద నల్లని మచ్చలతో వైద్యులను కలిసేవాళ్లూ ఉంటారు. ముఖానికి డెటాల్‌ పూసుకుంటే మొటిమలు తగ్గుతాయని ఇంటర్నెట్‌లో చూసిన ఓ అమ్మాయి కాన్సెన్‌ట్రేటెడ్‌ డెటాల్‌ పూసుకుని, ముఖం మొత్తంగా నల్లగా తయారుచేసుకుని నా దగ్గరకు వచ్చింది. ఇలా సమస్యను వదిలించుకోకపోగా, మరింత క్లిష్టంగా మార్చుకుంటే చికిత్స కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఎలాంటి చర్మ సమస్య తలెత్తినా సొంత చికిత్సలు అనుసరించకుండా, చర్మవైద్యుల దృష్టికి తీసుకువెళ్లడం మేలు!


- డాక్టర్‌ ఆర్‌.సుష్మ,

డెర్మటాలజిస్ట్‌, ది న్యూ యు డెర్మటాలజీ క్లినిక్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2020-11-24T16:40:17+05:30 IST