వర్క్ ఫ్రమ్ హోమ్‌తో నిద్ర సమస్యలు!
ABN , First Publish Date - 2020-09-12T18:18:31+05:30 IST
కరోనా మొదలైనప్పటి నుంచి చాలామంది ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి ఆలోచన అనిపించినా ఇప్పుడు అది వారి నిద్ర అలవాట్లను

ఆంధ్రజ్యోతి(12-09-2020)
కరోనా మొదలైనప్పటి నుంచి చాలామంది ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి ఆలోచన అనిపించినా ఇప్పుడు అది వారి నిద్ర అలవాట్లను ప్రభావితం చేస్తోందని తాజాగా ఒక అధ్యయనం చెబుతోంది. ఎక్కువమంది ఆఫీసు పనిలో పడి నిద్రకు కొంత సమయం కేటాయించడమే మరచిపోతున్నారట. ‘ట్రాన్స్లేషనల్ మెడిసిన్’ జర్నల్‌లో వచ్చిన ఈ అధ్యయనం వివరాలివి... కరోనాతో ఒక్కసారిగా జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల నిద్ర మీద ప్రభావం పడింది. నిద్రలోకి జారుకునే సమయం, చక్కని నిద్ర పట్టే సమయం, పగటి పూట నిద్రపోయే అలవాటు మీద తీవ్ర ప్రభావం చూపడాన్ని పరిశోధకులు గుర్తించారు. 18 నుంచి 65 ఏళ్ల వయసున్న 121 మంది మహిళలు, పురుషులను తమ అధ్యయనానికి ఎంచుకున్నారు. క్వారంటైన్‌కు ముందు, క్వారంటైన్ పూర్తయిన నలభై రోజుల తరువాత వీరి నిద్ర అలవాట్లను స్టడీ చేశారు. క్వారంటైన్ తరువాత వీరిలో నిద్ర సమయం తగ్గిపోవడం, సమయానికి నిద్రపట్టకపోవడం వంటివి గమనించారు. తక్కువ నిద్ర సమయం, స్వీయనిర్బంధానికి మధ్య సంబంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు రోజులో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ స్ర్కీన్ ఎక్కువ సమయం చూస్తారని, పనిగంటలు ఎక్కువ ఉండడం కూడా వీరిలో నిద్రలేమికి కారణమని గుర్తించారు. అంతేకాదు వీరిలో చాలామంది క్వారంటైన్ సమయంలో శారీరక వ్యాయామం చేయలేదని, అరోగ్యకరమైన ఆహారం తీసుకోలేదని పరిశోధకులు తేల్చారు.