కోలుకున్న తర్వాత కూడా...
ABN , First Publish Date - 2020-09-01T15:52:41+05:30 IST
తుఫాన్ వస్తుంది, వెళ్లిపోతుంది! కానీ తుఫాన్ కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది! కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం కూడా అలాంటిదే! కరోనా నుంచి కోలుకున్నా... ఆరోగ్యానికి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది!

ఆంధ్రజ్యోతి(01-09-2020): తుఫాన్ వస్తుంది, వెళ్లిపోతుంది! కానీ తుఫాన్ కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది! కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం కూడా అలాంటిదే! కరోనా నుంచి కోలుకున్నా... ఆరోగ్యానికి జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది! మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె లాంటి ప్రధాన అవయవాల సామర్ధ్యాలను వైద్యుల సలహాలు, సూచనలతో పరిరక్షించుకోవాలి!
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తులు బలహీనడడం, గట్టిపడడం, కుంచించుకుపోవడం, పూర్తి సామర్ధ్యం మేరకు పని చేయలేకపోవడం... ఇలా కరోనా తదనంతర ఇబ్బందులు దీర్ఘకాలం పాటు వెంటాడే వీలుంది. మరీ ముఖ్యంగా తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ దశకు చేరిన వాళ్లకు ఈ సమస్యలు తప్పవు. అయితే కొవిడ్ ఇన్ఫెక్షన్తో ఊపిరితిత్తులకు జరిగే నష్టం మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవేమిటంటే....
తీవ్రత
సోకిన కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఊపిరితిత్తుల స్వభావం, సామర్ధ్యం, రూపం మారుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రమైతే ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడతాయి, కుంచించుకుపోతాయి. ఇది తిరిగి సరిదిద్దలేని స్థితి.
పూర్వ రుగ్మతలు
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం జరుగుతుంది.
చికిత్స
కరోనా సోకిన తర్వాత చికిత్సలో జరిగే జాప్యం వల్ల కూడా ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం అవుతుంది. ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే ఊపిరితిత్తులకు జరిగే నష్టం అంత తక్కువగా ఉంటుంది.
జ్వరం వస్తే?
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్ చేయించుకుంటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పక వాడుతూ ఉండాలి. సాధారణంగా కరోనా తగ్గిపోయిన వారం నుంచి రెండు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని తెలిపే ప్రధాన సూచన జ్వరం. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి.
అసిడిటీతో రెట్టింపు నష్టం!
కరోనా నుంచి కోలుకున్నవారి ఊపిరితిత్తులు ఎంతోకొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్ధ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే, పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడవలసి ఉంటుంది.
వెంటనే ప్రాణాయామం వద్దు!
కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఊపిరితిత్తులను బలపరిచే ప్రాణాయామం చేయడం సరికాదు. కరోనా ఇన్ఫెక్షన్తో బలహీనపడిన ఊపిరితిత్తులు ప్రాణాయామంలో తీసుకునే వేగవంతమైన శ్వాస ప్రక్రియలతో మరింత అసౌకర్యానికి లోనవుతాయి. బలంగా, వేగంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాలతో ఊపిరితిత్తుల మీద పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రారంభంలో అలోమ, విలోమ వ్యాయామాలు చేయడం మేలు. ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకుని, ప్రాణాయామానికి అనువుగా మారినట్టు వైద్యులు ధ్రువీకరించిన తర్వాతే భస్ర్తిక లాంటి ప్రాణాయామ ప్రక్రియలను సాధన చేయాలి.
పల్మనరీ ఫైబ్రోసిస్!
కరోనా ప్రభావం ఊపిరితిత్తుల మీద భిన్నంగా ఉంటుంది. కొందరిలో ఊపిరితిత్తులు గట్టిపడి పల్మనరీ ఫైబ్రోసిస్ తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కోల్పోయి, శ్వాస తీసుకోవడం కొంత ఇబ్బందిగా మారుతుంది. వీరిలో ప్రధానంగా దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు వైద్యుల సూచనమేరకు క్రమం తప్పక మందులు వాడుతూ శ్వాసకు తోడ్పడే బైపాప్ వంటి పరికరాలు వాడుతూ ఉండాలి.
ఎ.ఆర్.డి.ఎస్!
కొవిడ్ - 19తో కూడిన న్యుమోనియా నుంచి కోలుకున్న వారు ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడతారు. ఈ స్థితి ఊపిరితిత్తుల వైఫల్యానికి దారితీస్తుంది. వీరికి దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ థెరపీ అవసరం పడుతుంది.
ఉబ్బసం ఉన్నవాళ్లలో...
ఉబ్బసంతో బాధపడే వారు కరోనా సోకి పూర్తిగా కోలుకున్న తర్వాత మరింత జాగ్రత్తగా నడుచుకోవాలి. వీరిలో అంతకుముందు లేని దగ్గు నిరంతరంగా వేధిస్తుంది. ఉబ్బసంతో దెబ్బతిన్న ఊపిరితిత్తుల సామర్ధ్యం కరోనాతో మరింత దెబ్బతిని ఉంటుంది. కాబట్టి మునుపటి కన్నా తేలికగా ఇతరత్రా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు లోనయ్యే వీలు పెరుగుతుంది. కాబట్టి ఉబ్బసానికి వాడే మందుల పరిమాణం పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి.
నిద్ర, ఆహారం, సాంత్వన!
కరోనాతో దెబ్బతిన్న ఊపిరితిత్తుల ఆరోగ్యం మరింత కుంగిపోకుండా కాపాడుకోవాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేమిటంటే...
నిద్ర: నిద్రతో వ్యాధినిరోధకశక్తి మెరుగవుతుంది. శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. కాబట్టి రోజుకు కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. సుఖమైన నిద్ర కోసం సంగీతం వినాలి.
ఆహారం: ఎరుపు, ఆకుపచ్చ... ఇలా వేర్వేరు రంగుల్లో ఉండే కూరగాయలు ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసకృత్తులు, పీచు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు తినాలి.
సాంత్వన: మానసిక ప్రశాంతతో నిండైన ఆరోగ్యం సమకూరుతుంది. ఇందుకోసం ధ్యానాన్ని సాధన చేయవచ్చు. మనసును ఆనందంగా ఉంచే కాలక్షేపాలు, అభిరుచులు అలవరుచుకోవాలి.
వ్యాయామాలు: కరోనా నుంచి కోలుకున్న వెంటనే శ్వాస కోసం ఆయాసపడేటంత తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవాళ్లు వైద్యుల సలహామేరకు నడుచుకోవాలి.
ప్రధాన అవయవాలన్నీ...
ఊపిరితిత్తుల తర్వాత కరోనా ప్రభావానికి గురయ్యే మరో ప్రధాన అవయవం గుండె! రక్తంలో గడ్డలు ఏర్పడి, మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడవచ్చు. రక్తనాళాలు కుంచించుకుపోయి, అంతర్గత అవయవాలకు జరిగే రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలా కరోనా దుష్ప్రభావాలు బోలెడు!
గుండె: శరీరం మొత్తానికీ రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్ధ్యం తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఊపిరితిత్తుల డ్యామేజీ మూలంగా తలెత్తే అత్యధిక ఒత్తిడి ప్రభావంతో గుండె దెబ్బతినవచ్చు. మయోకార్డైటిస్ అనే గుండె ఇన్ఫెక్షన్ కూడా తలెత్తవచ్చు.
మూత్రపిండాలు: కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మూత్రపిండాలకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యకు మధుమేహం తోడైతే మూత్రపిండాలు మరింత దెబ్బతింటాయి. కొందరిలో హఠాత్తుగా మూత్రపిండాలు ఫెయిల్ అయ్యే అక్యూట్ కిడ్నీ ఇంజురీ కూడా జరగవచ్చు. అధిక రక్తపోటు కలిగిన వారికి ఈ సమస్యలు మరింత చేటు చేస్తాయి.
రక్తనాళాలు: కరోనా వైరస్ రక్తనాళాల లోపలి గోడల్లోని ఎండోథీలియల్ కణాలను డ్యామేజ్ చేస్తుంది. ఫలితంగా రక్తం గడ్డకట్టడం, ఇమ్యూన్ రెస్పాన్స్‌కు కారణమయ్యే ప్రొటీన్ విడుదలలో మార్పులు జరిగి గుండెతో పాటు, ఇతరత్రా ప్రధాన అవయవాలకు నష్టం జరుగుతుంది.
కరోనా తదనంతర దుష్ప్రభావాల నుంచి ప్రధాన అవయవాలను కాపాడుకోవాలంటే వాటితో ముడిపడిఉన్న రుగ్మతలను (మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లు) అదుపులో ఉంచుకుంటూ, క్రమంతప్పక వైద్యులను సంప్రదిస్తూ అవసరమైన చికిత్సను కొనసాగించాలి.
- డాక్టర్ చిన్నంచెట్టి విజయ్ కుమార్
పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్.