ఆన్‌లైన్ ‘అలవాట్ల’తో ఇబ్బందే
ABN , First Publish Date - 2020-03-13T14:21:13+05:30 IST
మానవ జీవితంపై సామాజిక మాధ్యమాలు చూపే ప్రభావం గణనీయంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే అది ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తోందని ఇటీవల

మానవ జీవితంపై సామాజిక మాధ్యమాలు చూపే ప్రభావం గణనీయంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే అది ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తోందని ఇటీవల జరిపిన సర్వేలో తేలింది. ఫేస్‌బుక్ వినియోగదారులు ఆన్‌లైన్ స్నేహితులు తినే ఆనారోగ్యకరమైన స్నాక్స్, జంక్‌ఫుడ్, తీయటి పానీయాలను అదనంగా తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఫేస్‌బుక్ స్నేహితుల బృందంలోని సభ్యుల ఆహారపు అలవాట్లను తెలుసుకుని వాటిని పాటిస్తున్నారు. వాటిలో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు దీర్ఘకాలంలో వ్యాధులకు కారణమయ్యే జంక్‌ఫుడ్ కూడా ఉంటోంది.
నెటిజన్ల ఆహారపు అలవాట్లను సామాజిక మాధ్యమం ప్రభావితం చేస్తోందని ఒక అధ్యయనంలో తేలింది. తినే ఆహారం విషయంలో కూడా యువత కాపీ కొడుతోంది. కాపీ కొట్టడం అంటే ఆన్‌లైన్ స్నేహితులు తినే ఆహారాన్ని తెలుసుకుని అటువంటి ఆహారానికి అలవాటు పడుతున్నారు. దీంతో ఆ అలవాటు ఒక్కోసారి ఆనారోగ్యానికి దారితీస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
ఐదో వంతు అదే తిండి
ఈ అధ్యయనం కోసం ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు 369 మంది నుంచి వివరాలు సేకరించారు. వారివారి ఆన్‌లైన్ స్నేహితులు ఏఏ ఆహార పదార్థాలు, ఎంత మొత్తంలో తీసుకుంటారో అంచనా వేయండని కోరారు. తమ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ రోజూ పండ్లు, కూరగాయలు, శక్తికారక స్నాక్స్, షుగరీ డ్రింక్స్ తిసుకుంటారని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవాళ్ళు తెలిపారు. ఆ భావనతోనే తాము కూడా తక్షణ శక్తినిచ్చే పానీయాలను తీసుకుంటున్నట్లు వివరించారు. అధ్యయనం వివరాలను విశ్లేషించగా నెటిజన్ల ఆహారపు అలవాట్లతో ఐదో వంతు స్నేహితుల నుంచి తెలుసుకుని అమలు చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ అలవాట్లలో ఆరోగ్యకరమైన పదార్థాలతో పాటు జంక్‌ఫుడ్ కూడా ఉంది. రోజూ తీసుకునే ఆహారంలో ఐదో వంతు జంక్‌ఫుడ్ ఉన్న కారణంగా అనారోగ్యానికి గురవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కొన్ని ఆహార పదార్థాల ఎంపికలో యువత సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఫలానా ఐటెం మంచిదేనా అని ఆన్‌లైన్ స్నేహితుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో శరీర తత్వానికి తగ్గ ఆహారం తీసుకోలేకపోతున్నారని పరిశోధకులు తెలిపారు. అంతిమంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది స్నేహితుల ఎంపికగా మారిపోతోంది.
అవగాహన లోపం
స్థానికంగా పండిన ఆహారం, కుటుంబంలో తరాలుగా తినే పద్ధతులు ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల రాకతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పరిచయాలు పెరిగిపోయాయి. ఫేస్‌బుక్ గ్రూపులుగా ఏర్పడి ఒకరి ఆహారపు అలవాట్లను మరొకరు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎదుటి వారి ఆహారపు అలవాట్లను సొంతం చేసుకోవడంతో ఒక్కోసారి అనారోగ్యానికి గురవుతున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తులో ఇబ్బంది
పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారిపై ఫేస్‌బుక్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎటువంటి ఆహారం మంచిది? ఎంత తినాలి? అనే విషయాలకు కూడా స్నేహితులపైనే ఆధారపడుతున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరపడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ పేర్కొన్నారు. అందరూ ఒకే వయసువారు కావడం, కుటుంబ పెద్దల ప్రమేయం లేకపోవడం వంటి కారణాల వల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడంలో పొరపాట్లు జరుగుతున్నాయని ఆ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యవయస్కులు ఫర్వాలేదు
బహుళ సంస్కృతులు, భిన్న సంప్రదాయాలతో మిళితమైన భారత దేశంలో మధ్యవయస్కులు ఆరోగ్యకరమైన ఆహారంపైనే దృష్టి సారిస్తున్నట్లు మరో అధ్యయనంలో తేలింది. నిత్యావసరాలను కొనుగోలు చేసేటప్పుడు, ఆహార పదార్థాలకు ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఒక మార్కెట్ రీసెర్చ్ సంస్థ జరిపిన అధ్యయనం వెల్లడించింది. మధ్యవయసు వచ్చేసరికి బహుళ సంస్కృతుల ఆహారపు అలవాట్లను పరిశీలనాత్మక దృష్టిలో చూస్తున్నారు. ఇప్పుడు అందరూ సేంద్రియ ఆహారం పట్లే ఆసక్తి చూపుతున్నారని, జన్యుమార్పిడి చేసిన ఆహారం తినడానికి అంగీకరించడం లేదని అధ్యయనకారులు తెలిపారు. సర్వేలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది పట్టణ ప్రాంత ప్రజలు సేంద్రియ ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
శాకాహారంపై మక్కువ
కూరగాయలతో చేసిన ఆహార పదార్థాలపై నలభై ఏళ్ళు పైబడినవారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, మాంసాహారానికి దూరంగా ఉంటున్నట్లు ఆ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. డైట్ ప్రణాళికల జోలికి వెళ్ళడం లేదని తేలింది. రానున్న రోజుల్లో ఇంటి వద్దకే నిత్యావసరాలు తెప్పించుకునేందుకు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్ళు గణనీయంగా పెరుగుతాయని ఆ రీసర్చ్ సంస్థ తెలిపింది. ఇంటి భోజనాన్నే ఇష్టపడతారని, జంక్‌ఫుడ్ సహా బయటి ఆహార పదార్థాల కన్నా ఇంట్లో తయారు చేసే ఆహారమే ఆరోగ్యకరమైనదనే భావన కూడా పెరుగుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.
– ఎన్ రాంగోపాల్