వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్ అవసరం రాదట..!
ABN , First Publish Date - 2020-11-24T16:51:34+05:30 IST
కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకశక్తి ఏళ్ల తరబడి కొనసాగి రీఇన్ఫెక్షన్కు గురవకుండా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ కోవకు చెందిన వాళ్ల శరీరాల్లో కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే

ఇమ్యూనిటీ ఏళ్ల తరబడి...
ఆంధ్రజ్యోతి(24-11-2020): కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకశక్తి ఏళ్ల తరబడి కొనసాగి రీఇన్ఫెక్షన్కు గురవకుండా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ కోవకు చెందిన వాళ్ల శరీరాల్లో కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాధినిరోధక కణాలు సరిపడా తయారై ఉంటాయి కాబట్టి వీళ్లకు పదే పదే కరోనా వ్యాక్సినేషన్ కూడా అవసరం ఉండదు అంటున్నారు అధ్యయనకారులు.
పలువురు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కొవిడ్ నుంచి కోలుకున్న 19 నుంచి 81 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 185 కొవిడ్ బాధితుల నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షించారు. ఆ అధ్యయనంలో వారి శరీరాల్లో వైరస్‌తో సమర్థంగా పోరాడే బీ, టీ లింఫోసైట్ కణాల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు కనిపించింది. ఇలా పెరిగిన కణాలు ఏళ్ల తరబడి శరీరాల్లో ఉండి, రీ ఇన్ఫెక్షన్కు గురి కాకుండా రక్షణ కల్పిస్తాయి. అలాగే వీరి శరీరాల్లో కొవిడ్ వైరస్‌ను సంహరించే క్రమంలో తయారయ్యే యాంటీబాడీలు కూడా ఆలస్యంగా అంతరిస్తున్నట్టు కూడా వారు గమనించారు.
కోలుకున్న కొవిడ్ బాధితుల శరీరాల్లో రోగనిరోధక వ్యవస్థ కొవిడ్ వైరస్‌ను ఏళ్లతరబడి జ్ఞాపకం పెట్టుకుని, అది ఎప్పుడు దాడి చేసినా, తక్షణమే స్పందించి వైరస్‌తో పోరాడి వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది. ఇలాంటి జ్ఞాపకశక్తి ఫలితంగా ఏళ్లతరబడి వైరస్‌తో కూడిన వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గే వీలుంటుంది అంటున్నారు అధ్యయనకారులు. అయితే ఈ తరహా రోగనిరోధకశక్తి ఎన్నేళ్ల పాటు కొనసాగుతుందనేది కచ్చితంగా చెప్పడం కష్టం అని శాస్త్రవేత్తలు అంటున్నారు.