రెండేళ్ల పాపకు రాగి జావ తాగించవచ్చా..?

ABN , First Publish Date - 2020-12-25T20:47:38+05:30 IST

సాధారణంగా ఏడాదిన్నర నుండి రెండేళ్లలోపు పిల్లలకు మనం ఇంట్లో తినే ఆహారం అలవాటు చేసెయ్యాలి. అందులో భాగంగా ఓ పూట రాగి జావ ఇవ్వడం మంచిదే. రాగిలో

రెండేళ్ల పాపకు రాగి జావ తాగించవచ్చా..?

ఆంధ్రజ్యోతి(25-12-2020)

ప్రశ్న: మా పాపకు రెండేళ్లు. రోజూ ఓ పూట రాగి జావ పట్టవచ్చా? మలబద్దకం వంటి సమస్యలేమైనా వస్తాయా?


- శ్రావణి, హైదరాబాద్

డాక్టర్ సమాధానం: సాధారణంగా ఏడాదిన్నర నుండి రెండేళ్లలోపు పిల్లలకు మనం ఇంట్లో తినే ఆహారం అలవాటు చేసెయ్యాలి. అందులో భాగంగా ఓ పూట రాగి జావ ఇవ్వడం మంచిదే. రాగిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలతో పాటు ఎదిగే పిల్లలకు ఎంతో అవసరమైన కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. రాగి పిండితో కంటే మొలకెత్తిన రాగులతో చేసిన జావ నుండి పోషకాలు ఎక్కువగా అందుతాయి. రాగిలోని పీచుపదార్థం మలబద్దకాన్ని దూరంగా ఉంచుతుంది. అయితే తగినన్ని నీళ్లు తాగకుంటే ఇదే పీచు మలబద్దకాన్ని కలిగిస్తుంది కూడా. అందువల్ల మీ పాపకు రాగి జావ ఇచ్చిన రోజు మరికొంచెం ఎక్కువ నీళ్లు పడితే సరిపోతుంది. రాగిని కేవలం మరొక ధాన్యానికి (బియ్యం, గోధుమలు మొదలైనవి) ప్రత్యామ్నాయంగానే వాడాలి తప్ప రాగి జావ పెడుతున్నాం కనుక కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు మొదలైనవి మానేయకూడదు. ఇంట్లో వండిన పప్పు, కూరలూ లేదా అరటి పండును జావలో గుజ్జుగా చేసి కలిపి పెట్టండి. బాదం, ఆక్రోట్‌, జీడిపప్పు లాంటి వాటిని పొడి చేసి జావతో కలిపి తినిపించడం మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


Updated Date - 2020-12-25T20:47:38+05:30 IST