తేనెను రోజుకు రెండు, మూడు స్పూన్లకు మించి తీసుకుంటే..

ABN , First Publish Date - 2020-05-24T18:08:24+05:30 IST

తేనె అందరికీ మంచిదేనా? తేనె వాడకానికి పరిమితులేమిటి? పదేళ్ల లోపు పిల్లలకు తేనె ఇవ్వవచ్చా?

తేనెను రోజుకు రెండు, మూడు స్పూన్లకు మించి తీసుకుంటే..

ఆంధ్రజ్యోతి(24-05-2020)

ప్రశ్న: తేనె అందరికీ మంచిదేనా? తేనె వాడకానికి పరిమితులేమిటి? పదేళ్ల లోపు పిల్లలకు తేనె ఇవ్వవచ్చా?

- జ్యోత్స్న , బెంగుళూరు

 

డాక్టర్ సమాధానం: ఓ స్పూను లేదా ఇరవై గ్రాముల తేనెతో అరవై ఐదు కెలోరీల శక్తి లభిస్తుంది, గ్లూకోజు, ఫ్రక్టోజ్‌, సుక్రోస్‌, మాల్టోజ్‌ అనే చక్కెరలు కలిపి పదిహేడు గ్రాములు ఉంటాయి. పీచుపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు... తేనెలో ఉండవు. విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ అవి శరీరానికి అవసరమయ్యే మోతాదుల్లో కావాలంటే కనీసం అరకిలో తేనె తీసుకోవాలి. అందుకే తేనెను విటమిన్లు, ఖనిజాల కోసం కన్నా అందులోని శక్తినిచ్చే పదార్థాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం మాత్రమే, పరిమిత మోతాదుల్లో తీసుకోవాలి.

అలా తీసుకున్నప్పుడు తేనె ఆరోగ్యాన్ని కాపాడుతూ, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌, టైగ్ర్లిసెరైడ్స్‌ అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. మార్కెట్లో దొరికే తేనెను కొన్నిసార్లు చక్కెర లేదా బెల్లం పాకంతో కల్తీ చేస్తారు. కాబట్టి కొనేప్పుడు జాగ్రత్త అవసరం.  చర్మ సంబంధిత వ్యాధుల్లో పూతగా తేనెను వాడతారు. పిల్లల్లో దగ్గు తగ్గడానికి తేనె ఉపకరిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్నా, కెలోరీలు, చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రోజుకు రెండు, మూడు స్పూన్లకు మించి తీసుకోకూడదు. తేనెలో ఓ రకమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఏడాది లోపు పిల్లలకు ఈ బాక్టీరియా ప్రమాదకరమైంది. కానీ ఏడాది దాటిన పిల్లలకు రోజుకు ఒకటి రెండు స్పూనులకు మించకుండా తేనె ఇవ్వచ్చు. 


డా. లహరి సూరపనేని న్యూట్రిషనిస్ట్,

వెల్‌నెస్ కన్సల్టెంట్ nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-24T18:08:24+05:30 IST