వానాకాలం జ్వరం, జలుబు పోవాలంటే...
ABN , First Publish Date - 2020-07-19T23:29:11+05:30 IST
వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(19-07-2020)
ప్రశ్న: వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
-రమ్య, శ్రీకాకుళం
డాక్టర్ సమాధానం: వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి వ్యాపించడానికి ఎంతో అనుకూలమైనవి. అందువలనే వర్షాలు మొదలవ్వగానే జలుబులు, జ్వరాలు మొదలవుతాయి. రకరకాల వైరస్, బాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల వలన ఈ అనారోగ్యాలు వస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు ఈ అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చు. రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల పోషకపదార్ధాలు అత్యవసరం. నిమ్మ, నారింజ, ఆపిల్, జామ, వంటి తాజా పండ్లన్నిటిలోను అధికంగా ఉండే విటమిన్ సి, బాదాం, పిస్తా, ఆక్రోట్, పొద్దుతిరుగుడు గింజల వంటి వాటిలో ఉండే విటమిన్ ఈ, అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, ఉడికించిన శనగల్లో ఉండేటువంటి విటమిన్ బీ 6, కారెట్, బొప్పాయి, గుమ్మడి మొదలైన వాటిల్లో ఉండే విటమిన్ ఏ, ఆకుకూరల్లో, పప్పు ధాన్యాల్లో ఉండేటువంటి ఫోలేట్, సూర్యరశ్మి నుండి వచ్చే విటమిన్ డీ, మాంసాహారం, ఆకుకూరల నుండి వచ్చే ఐరన్, పెరుగు, మజ్జిగ నుండి వచ్చే ప్రోబైయటిక్స్ ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం. ఈ విటమిన్లు, మినరల్స్‌ను టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా ఈ సూక్ష్మజీవుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమే. ఎప్పుడు బయటికి వెళ్లి వచ్చినా కాళ్ళు, చేతులు, ముఖం సబ్బుతో కడుక్కోవడం, వేడిగా ఉండే ఆహారం మాత్రమే తినడం, మంచినీళ్లు కాచి చల్లార్చి తాగడం, ఇంట్లో తేమ లేకుండా చూసుకోవడం, వర్షంలో తడిసినప్పుడు వెంటనే బట్టలు పొడి బట్టలు మార్చుకోవడం మొదలైన జాగ్రత్తలు పాటిస్తే ఈ జలుబులు, జ్వరాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)