అల్లం తింటే కరోనా దరి చేరదా?

ABN , First Publish Date - 2020-07-19T22:03:10+05:30 IST

కరోనా కాలంలో హాట్‌ కేకుల్లా అమ్ముడవుతోంది అల్లం. చాలా మంది వైద్యులు కూడా అల్లాన్ని రోజువారీ ఆహారంలో తినండి అని సిఫారసు చేస్తున్నారు. ఇళ్లలో కిలోల కొద్ధీ అల్లాన్ని

అల్లం తింటే కరోనా దరి చేరదా?

ఆంధ్రజ్యోతి(19-07-2020)

కరోనా కాలంలో హాట్‌ కేకుల్లా అమ్ముడవుతోంది అల్లం. చాలా మంది వైద్యులు కూడా అల్లాన్ని రోజువారీ ఆహారంలో తినండి అని సిఫారసు చేస్తున్నారు. ఇళ్లలో కిలోల కొద్ధీ అల్లాన్ని వాడేస్తున్నారు. అసలు అల్లానికి కరోనాకి ఏమిటి సంబంధం? అ అల్లం తింటే కరోనా పోతుందా? నిజానికి అల్లం వల్ల కరోనా వైరస్‌ చచ్చిపోతుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదు. కానీ అల్లం మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కరోనా వంటి వైరస్‌లతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజెరోల్‌ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి దరిచేరవు. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు. విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పడు అల్లం, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని తినాలి. ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రోజూ అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఉత్తమం. అల్లం టీ, అల్లం చారు, అల్లం పచ్చడి ఇలా ఎలా తిన్నా... తల్లి లాగే అల్లం కూడా మేలే చేస్తుంది. మధుమేహ సమస్య ఉన్నవారికి అల్లం చాలా మంచిది. రక్తంలోని చక్కెర నిల్వలను అల్లం తగ్గిస్తుందని ఓ పరిశోధన తేల్చింది. ఆర్ధరైటిస్‌ సమస్య ఉన్నవాళ్లు కూడా అల్లాన్ని తినడం చాలా మంచిది. కీళ్ల నొప్పిని తగ్గించడంలో అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అజీర్తి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది. రుచి గురించి పట్టించుకోకుండా ప్రతి రోజూ ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను తినడం అలవాటు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 

Updated Date - 2020-07-19T22:03:10+05:30 IST