కొవిడ్‌తో కిడ్నీలు కుదేలు..

ABN , First Publish Date - 2020-10-27T18:45:50+05:30 IST

కొవిడ్‌ చెద కిడ్నీలకూ పడుతుంది. మేడిపండు చందంలా పైపైన ఆరోగ్యం మెరుగ్గానే కనిపించినా, లోలోపల కిడ్నీలు మెల్లగా గుల్లగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి కరోనా తదనంతరం కూడా కిడ్నీల మీద ఓ కన్నేసి ఉంచాల్సిందే.. దీర్ఘకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో మసలుకోవలసిందే అంటున్నారు నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీ భూషణ్‌ రాజు!

కొవిడ్‌తో కిడ్నీలు కుదేలు..

ఆంధ్రజ్యోతి(27-10-2020)

కొవిడ్‌ చెద కిడ్నీలకూ పడుతుంది. మేడిపండు చందంలా పైపైన ఆరోగ్యం మెరుగ్గానే కనిపించినా, లోలోపల కిడ్నీలు మెల్లగా గుల్లగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి కరోనా తదనంతరం కూడా కిడ్నీల మీద ఓ కన్నేసి ఉంచాల్సిందే.. దీర్ఘకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో మసలుకోవలసిందే అంటున్నారు నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీ భూషణ్‌ రాజు!


కరోనా  వైరస్‌ ప్రధానంగా శ్వాసకోశవ్యవస్థ మీద ప్రభావం చూపించి, ఊపిరితిత్తులను దెబ్బతీసినా, గుండె, కాలేయం, మూత్రపిండాలు కూడా ఎంతోకొంత ఈ వైరస్‌ ప్రభావానికి గురయిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఎటువంటి మూత్రపిండాల సమస్యలూ లేని వారితో పోలిస్తే, కరోనా సోకే సమయానికి డయాలసిస్‌లో ఉన్నవాళ్లు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లకు ఈ వైరస్‌ మరింత చేటు చేస్తుంది. ముందు నుంచీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి కరోనా సోకడం మూలంగా కిడ్నీల పనితనం వేగంగా తగ్గిపోతుంది.


కరోనా వైరస్‌ నేరుగా మూత్రపిండాలకు సోకి, వాటిని ప్రత్యక్షంగా దెబ్బతీయడమే కాకుండా, ఇతర అవయవాల్లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ మూలంగా పరోక్షంగా ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడి అవి డ్యామేజీకి గురయ్యే పరిస్థితీ ఉంటుంది. ఇలా కరోనా వైరస్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.


మూత్రపిండాల మార్పిడి!

కొవిడ్‌ మూలంగా మూత్రపిండాలు ఫెయిల్‌ అయి, మరణించిన వార్తలు విన్నప్పుడు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఆందోళనకు గురవడం సహజం. అయితే ఈ మరణాలన్నిటికీ కొవిడ్‌ కారణమే అయినా, నిజానికి... మూత్రపిండాల మార్పిడి చేయించుకున్నవాళ్లు కచ్చితమైన రక్షణ చర్యలు పాటించకపోవడమే అసలు కారణం! ఈ కోవకు చెందినవాళ్లు రోగనిరోధకశక్తిని తగ్గించే ఇమ్యునోసప్రెసెంట్‌ మందులు వాడుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ అయినా తేలికగా సోకుతుంది. కాబట్టే అందుకు వీలు లేకుండా, ఎల్లవేళలా ముఖానికి మాస్క్‌ ధరిస్తూ ఆత్మీయులతో తప్ప ఇతరులకు దూరం పాటిస్తూ, ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి.


అయితే ఏళ్లు గడిచిన తర్వాత కొందరిలో కొంత అలసత్వం ఏర్పడుతుంది. ఇన్నేళ్లు గడిచాయి కాబట్టి మాకేం కాదులే! అనే ధీమాతో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం మూలంగా కొవిడ్‌ బారిన పడి, పరిస్థితి విషమించి ప్రాణాంతకంగా మారుతుంది. ఇప్పటివరకూ కొవిడ్‌తో మూత్రపిండాలు ఫెయిల్‌ అవడం మూలంగా నమోదయిన మరణాలన్నీ ఈ కోవకు చెందినవే! కాబట్టి తగు జాగ్రత్తలు పాటించేవాళ్లు భయపడవలసిన అవసరం లేదు.


లక్షణాలు స్వల్పం!

మూత్రపిండాల ఆరోగ్యం చాప కింద నీరులా దిగజారుతుంది. కాబట్టే పరిస్థితి తీవ్రమయ్యే వరకూ ఎవరికి వారు కిడ్నీల డ్యామేజీని గమనించే వీలుండదు. ఏ కారణం వల్లనైనా మూడు నెలలకు మించి కిడ్నీలు అనారోగ్యానికి గురైతే, అవి శాశ్వత డ్యామేజీకి గురవుతాయి. సాధారణంగా కిడ్నీల డ్యామేజీ కాళ్ల వాపుతో మొదలవుతూ ఉంటుంది. కొందరిలో ఈ లక్షణం కూడా బయల్పడదు. దాంతో సమస్యను కనిపెట్టే పరిస్థితి ఉండదు.


ఒకసారి మొదలైన మూత్రపిండాల డ్యామేజీ ఏళ్ల తరబడి కొనసాగుతుంది. కాబట్టి ఆ వేగాన్ని మందులతో నెమ్మదించడం ఒక్కటే కిడ్నీ ఫెయిల్యూర్‌ నుంచి తప్పించుకోగలిగే ఏకైక మార్గం! కనుక కుటుంబ చరిత్రలో కిడ్నీ సమస్యలు కలిగినవాళ్లు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు కలిగినవాళ్లు మూత్రపిండాల ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి.


కిడ్నీ ఫ్యాక్ట్స్‌


శరీరంలోని మొత్తం రక్తాన్ని కిడ్నీలు గంటకు 12 సార్లు వడపోస్తూ ఉంటాయి.


రోజు మొత్తంలో మూత్రపిండాలు 180 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి.


కాలేయానికి చోటివ్వడం కోసం కుడివైపు మూత్రపిండం ఎడమవైపు కిడ్నీ కంటే కొద్దిగా చిన్నదిగా, దిగువకు ఉంటుంది.


విపరీతంగా నీళ్లు తాగడం కిడ్నీలకు ప్రమాదకరం. ఎక్కువ పరిమాణంలోని నీళ్లను తాగడం వల్ల కిడ్నీలు అన్ని నీళ్లను త్వరితంగా వడగట్టలేకపోవడం మూలంగా రక్తంలోని సోడియం పలుచనవుతుంది. హైపోనట్రీమియా అనే ఈ స్థితిలో శరీరంలోని కణాలు వాపునకు గురవుతాయి.

నొప్పి నివారణ మందులైన ఇబ్యుప్రోఫెన్‌, యాస్పిరిన్‌లు కిడ్నీలను దెబ్బతీస్తాయి.


లాంగ్‌ కొవిడ్

కొవిడ్‌ ప్రభావం దీర్ఘకాలంలో ఆరోగ్యం మీద ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కోలుకోవడం అనేది కొవిడ్‌ తీవ్రత, పూర్వం నుంచీ ఉన్న ఇతర వ్యాధులు (అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు), వయసు... ఇలా కొవిడ్‌ తదనంతర ఆరోగ్య స్థితిని ప్రభావితం చేసే అంశాలు బోలెడన్ని ఉంటాయి. అయితే కొవిడ్‌ సోకిన వారిలో 85ు నుంచి 90ు మందికి ఇంటి చికిత్సతోనే పూర్తిగా నయమైపోతూ ఉంటుంది.


మిగతా 10ు నుంచి 15ు మంది ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స అవసరం పడితే, వారిలో ఒకటి లేదా రెండు శాతం మంది పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. మిగతా 18ు మందిని గమనిస్తే, వారిలో ఎక్కువమంది ఊపిరితిత్తులు, అంతకంటే తక్కువ మంది గుండె, ఇంకా తక్కువమంది మూత్రపిండాల జబ్బుకు గురవుతున్నారు. అయితే వీళ్లందరికీ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. అలా ఎంతకాలం అనేది ఇప్పుడే చెప్పడం కష్టం!కోలుకున్న తర్వాత కూడా!

ఒకసారి కరోనా కారణంగా మూత్రపిండాలు దెబ్బతిన్నవాళ్లలో మున్ముందు జరగబోయే డ్యామేజీని నెమ్మదించే చికిత్స ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. వీళ్లు వైద్యుల సూచనల మేరకు జీవితకాలం పాటు ఆహార, జీవనశైలి మార్పులను అలవరుచుకోవలసి ఉంటుంది. అవేంటంటే...


మాంసాహారం వద్దు: సాధారణంగా కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత రోగనిరోధకశక్తి మెరుగు కోసం మాంసాహారం తీసుకోమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మూత్రపిండాలు దెబ్బతిన్నవాళ్లు మాంసాహారాన్ని తగ్గించాలి. బదులుగా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి.


పొటాషియం తగ్గించాలి: యాపిల్‌, బొప్పాయి మినహా మిగతా అన్ని పళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు పళ్లే తినాలి. అలాగే పొటాషియం కలిసి ఉండే ఓ.ఆర్‌.ఎస్‌ ద్రవం కూడా తీసుకోకూడదు. కొబ్బరినీళ్లు తాగకూడదు.


నీళ్లు: పూర్వంతో పోలిస్తే ఈ కోవకు చెందిన వాళ్లు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురవకుండా చూసుకోవాలి.


మందులు: కొవిడ్‌ మూలంగా మూత్రపిండాలు దెబ్బతిన్నవాళ్లు ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు వాడే మందులు మూత్రపిండాలను మరింత దెబ్బతీసేవిగా ఉండకూడదు. కాబట్టి చేతికి అందిన యాంటీబయాటిక్స్‌, నొప్పి తగ్గించే మందులు వాడకూడదు. ఏ మందులు వాడుతున్నా మూత్రపిండాల వైద్యులకు చూపించి, వాడుకోవాలి. అలాగే ముందు నుంచీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు, కొవిడ్‌ సోకిన సమయంలో అందరూ వాడే కొవిడ్‌ మందులు (అజిత్రొమైసిన్‌, డాక్సీసైక్లిన్‌) వాడడం సరికాదు. ఈ కోవకు చెందినవాళ్లు సోడియం బైకార్బొనేట్‌ లాంటి సురక్షితమైన మందులను వైద్యుల సూచనమేరకు వాడుకోవాలి.


వ్యాయామం వద్దు: కొవిడ్‌ నుంచి కోలుకున్న ఆరు నెలల వరకూ శారీరక శ్రమ చేయకుండా, విశ్రాంతిగా గడపడం ఎంతో అవసరం. నడక, పరుగు, ఇతరత్రా వ్యాయామాలు, యోగా లాంటివి చేయకుండా ఉండడమే మేలు.


వైద్యపరీక్షలు: కరోనా వైరస్‌ శరీరం నుంచి పూర్తిగా వెళ్లిపోయినా, అప్పటికే కిడ్నీలకు జరిగిన నష్టం అలాగే మిగిలిపోతుంది. ఆ నష్టం మరింత పెరగకుండా ఉండాలంటే కిడ్నీల మీద ఓ కన్నేసి ఉంచాలి. ఇందుకోసం ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.అపోహలు - వాస్తవాలు!

డయాలసిస్‌: ఒకసారి డయాలసిస్‌ చేయించుకోవడం మొదలుపెడితే జీవితాంతం దాని మీద ఆధాపడవలసి వస్తుందనేది అపోహ. ఈ చికిత్స తీసుకునే 80ు మందికి, పూర్తిగా కోలుకున్న తర్వాత డయాలసిస్‌ అవసరం పడదు. కేవలం 20 నుంచి 30 శాతం మందికే ఎక్కువ కాలం పాటు డయాలసిస్‌ తీసుకోవలసి వస్తుంది.


కిడ్నీ మార్పిడి: కిడ్నీలు డ్యామేజీ అయ్యాయని తెలియగానే మార్పిడి చేయించుకోవాలనుకోవటం పొరపాటు. ఇది ఎవరికి వారు తమకిష్టమైన మార్గంలో చేసుకునే ప్రక్రియ కాదు. కిడ్నీ ఫెయిలయిన వాళ్లలో ఎక్కువ మంది కిడ్నీ మార్పిడికి సూటయ్యే శారీరక పరిస్థితి ఉండదు. మూత్రపిండాల మార్పిడికి అందరూ అర్హులు కారు. ఆర్థిక స్థోమత, దాతలు ఉన్నంతమాత్రాన మార్పిడికి పూనుకోకూడదు. మార్పిడికి తగిన అర్హతలు వైద్యులే నిర్ణయించగలుగుతారు. కాబట్టి స్వీయ నిర్ణయం సరి కాదు. 


కిడ్నీ బయాప్సీ: మూత్రపిండాల పరీక్షలో కిడ్నీ బయాప్సీ కీలకమైనది. బయాప్పీ చేసిన వ్యక్తితో పాటు, అతని ముందు తరాల మూత్రపిండాల ఆరోగ్యాన్నీ ఈ పరీక్షతో కనిపెట్టే వీలుంది. అయితే బయాప్సీ కోసం ముక్క తీస్తే, కిడ్నీ పాడైపోతుందనీ, ఆ భాగం భర్తీ అయ్యే అవకాశం ఉండదు అనేవి అర్థం లేని భయాలు. 


డాక్టర్‌ శ్రీ భూషణ్‌ రాజు

నెఫ్రాలజిస్ట్‌, నిమ్స్‌, హైదరాబాద్‌.

9848492951

Updated Date - 2020-10-27T18:45:50+05:30 IST