కరోనా: నీళ్లు బాగా తాగినా.. వేడి నీళ్లతో స్నానం చేసినా..
ABN , First Publish Date - 2020-03-24T14:28:28+05:30 IST
ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా... కరోనా నుంచి రక్షణ పొందే సలహాలు, సూచనలే! అయితే వీటిలో అపోహలకు పురిగొల్పేవే ఎక్కువ! ఇలాంటి వాటితో మరింత అయోమయానికి లోనవకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి!

ఆంధ్రజ్యోతి (24-03-2020): ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా... కరోనా నుంచి రక్షణ పొందే సలహాలు, సూచనలే! అయితే వీటిలో అపోహలకు పురిగొల్పేవే ఎక్కువ! ఇలాంటి వాటితో మరింత అయోమయానికి లోనవకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి! ఇందుకోసం కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి!
మాస్క్ ఎవరికి? ఎప్పుడు?
ఇతరుల నుంచి మనకు, మన నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్క్‌లు ధరించాలి. అయితే ఇలాగని ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మాస్క్‌లు ధరించి ఉండవలసిన అవసరం లేదు. మాస్క్ ఎవరు వేసుకోవాలంటే....
లక్షణాలు ఉన్నప్పుడు (దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది)
‘కొవిడ్ - 19’ సోకిన/సోకిన అనుమానం ఉన్న వ్యక్తి కుటుంబసభ్యులు.
కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స చేసే వైద్య సిబ్బంది.
మాస్క్ వేసుకున్నప్పుడు...
మాస్క్ ధరిస్తున్నారా? అయితే దాన్ని వాడడం, డిస్పోజ్ చేయడం గురించి కూడా మీరు తెలుసుకోవాలి.
మాస్క్ ముడతలు ఊడదీయాలి. ఆ ముడతలు కింది వైపుకు ఉండేలా చూసుకోవాలి.
ముక్కు, నోరు, కింది దవడ కవర్ చేసే విధంగా, గాలి చొరబడకుండా ఉండేలా మాస్క్‌ను అడ్జస్ట్ చేసుకుని కట్టుకోవాలి.
ప్రతి ఆరు గంటలకూ మాస్క్ మార్చాలి. లేదా నీటితో తడిసిన వెంటనే మార్చాలి.
మాస్క్ తొలగించేటప్పుడు దాని ముందరి భాగాన్ని చేతులతో తాకకూడదు.
మాస్క్‌లను ముఖం మీద నుంచి తొలగించి, మెడలో వేలాడదీసుకోకూడదు.
డిస్పోజబుల్ మాస్క్‌లను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి వాడకూడదు. వాడిన మాస్క్‌లను మూత ఉన్న చెత్త డబ్బాల్లో వేయాలి.
మాస్క్ తొలగించిన తర్వాత చేతులను సబ్బుతో లేదంటే ఆల్కహాల్‌తో
కూడిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

అపోహలు..
నీళ్ళు బాగా తాగడం వల్ల కరోనా వైరస్ ఒంట్లో నుంచి పోతుందని అనుకోవడం అపోహే. అలాగే, ఐస్ క్రీములు తిన్నంత మాత్రాన వైరస్ స్తంభించిపోతుందని అనుకోవడమూ తప్పే!
వేడి నీళ్లతో స్నానం చేసినా, అలాగే హ్యాండ్ డ్రయ్యర్లు వాడినా వైరస్ చనిపోతుందని అనుకోవడం పొరపాటు. అలాగే, ఎండలో నిలబడినంత మాత్రాన వైరస్ పోదు.
ఒంటి మీద ఆల్కహాల్ స్ర్పే చేసుకున్నా, లేదంటే ఆల్కహాల్ తాగినా వైరస్ చనిపోతుందనుకోవడం అపోహ.
ఫ్లూ టీకాలు వేసుకుంటే కొవిడ్ 19 వైరస్ నుంచి రక్షణ లభిస్తుందనే ప్రచారం అర్థరహితమే.
వైద్యులను ఎప్పుడు కలవాలి?
ఈ లక్షణాలు ఉంటే: దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది
ఈ ప్రయాణాలు చేసి ఉంటే:
పై లక్షణాలు ఉన్నా, లేకున్నా కరోనా తీవ్రంగా ఉన్న దేశాలు (ఇరాన్, ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) సందర్శించి వచ్చి ఉంటే....
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి:
అలాంటి వ్యక్తితో అంతకన్నా ముందు కలిసి ప్రయాణం చేసి ఉన్నా, కలిసి ఒకే చోట స్వల్ప సమయం గడిపి ఉన్నా...

మీరు ఈ కోవకు చెందిన వారైతే హెల్ప్‌లైన్ నంబరు 011-2397 8046ను సంప్రతించండి. ఈ హెల్ప్‌లైన్ సర్వీస్ మీ వివరాలు నమోదు చేసుకుని, ‘కొవిడ్ - 19’ టెస్టింగ్ ప్రోటోకాల్‌తో మిమ్మల్ని సంప్రతిస్తుంది. ఒకవేళ ప్రొటోకాల్ ప్రకారం, మీరు ‘కొవిడ్ - 19’ పరీక్షకు అర్హులని తేలితే మిమ్మల్ని ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రయోగశాలలో పరీక్షిస్తారు. మరింత సమాచారం కోసం ఫోన్ ద్వారా 911123978046ను, ఈ-మెయిల్ ద్వారా ncov2019@gmail.comలో సంప్రతించవచ్చు.
డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్
కనీసం అరవై శాతానికి పైగా ఆల్కహాల్ కంటెంట్ ఉన్న శానిటైజర్లను వాడాలి. నోవెల్ కరోనా వైరస్ లాంటి వైరస్‌లను అవి పూర్తిగా చంపేయగలుగుతాయి. అయితే, వట్టి శానిటైజర్లు వాడినంత మాత్రాన సరిపోదు. సబ్బు ఉపయోగించి, తరచూ (కనీసం ఇరవై సెకన్ల పాటు) చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేతులు కడుక్కుంటూ, అలాంటి శానిటైజర్లు వాడితే అది ప్రభావం చూపుతుంది.
మాటిమాటికీ ముఖాన్ని ముట్టుకోవడం మానేయాలి.
ఇంట్లో ఎవరికైనా జలుబు, జ్వరంగా అనిపిస్తే, ముందు జాగ్రత్త పడాలి. అందరూ ఒకే పాత్రలు వాడడం మానేయాలి.
దగ్గుతూ, తుమ్ముతూ ఉన్నవాళ్ళకు దూరంగా ఉండాలి.
ఇంటా బయటా అందరితో దూరం పాటించాలి.

ఆ ఐదు పనులు!
కరోనా నుంచి రక్షణ పొందడం కోసం అనుసరించవలసిన సామాన్యమైన ఐదు పనుల గురించి గూగుల్ తన హోమ్‌పేజ్‌లో పేర్కొంది. అవేమిటంటే....
చేతులు: తరచుగా కడగండి
మోచేతులు: వీటితో నోరు మూసి, దగ్గండి
ముఖం: చేతులతో తాకకండి
కాళ్లు: మూడు అడుగుల దూరం పాటించండి
సుస్తీ:ఒంట్లో బాగోలేదా? ఇంటిపట్టునే ఉండండి
వ్యాధినిరోధకశక్తిని మందులతో పెంచుకోవచ్చా?
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉండాలి. అయితే ఇందుకోసం మందులూ లేకపోలేదు. అయితే వీటి అవసరం ఎవరికి? ఎంతమేరకు?
ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపే ప్రతి ఒక్కరికీ వ్యాధినిరోధకశక్తి మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి వీరికి అదనంగా మందులు వాడవలసిన అవసరం లేదు. అయితే పిల్లల్లో, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాగే కేన్సర్ చికిత్సలు తీసుకుంటున్నవారు, రుమటాయిడ్ ఆర్థ్రయిటి్సతో బాధపడుతూ స్టెరాయిడ్లు వాడుతున్న వారు, మధుమేహులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తుల రుగ్మతలు కలిగి ఉన్నవారు, వ్యాధినిరోధక శక్తిని తగ్గించే మందులు వాడే వారిలో రోగనిరోధకశక్తి మరింత బలహీనంగా ఉంటుంది. కాబట్టి వీళ్లు వైద్యుల సూచన మేరకు రోగనిరోధకశక్తిని పెంచే ఇమ్యూన్ బూస్టర్స్ వాడడం ద్వారా కొంతమేరకు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. జీర్ణశక్తి, శరీర సామర్థ్యం కలిగి ఉండి, సమ్మిళిత పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడి తక్కువగా ఉండే ఆరోగ్యవంతులకు ఈ మందులతో అదనంగా ప్రయోజనం కలగదు.
- డాక్టర్ ఎస్.ఎ. రఫీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్, పల్మనాలజిస్ట్, హైదరాబాద్
