ఆ థెరపీతో ప్రమాదమా?

ABN , First Publish Date - 2020-07-14T17:02:57+05:30 IST

డాక్టర్‌! నాకు అంగస్తంభన సమస్య ఉంది. ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదిస్తే, రక్తనాళాలు పాడయ్యాయనీ, షాక్‌ థెరపీ పెట్టాలనీ అంటున్నారు.

ఆ థెరపీతో ప్రమాదమా?

ఆంధ్రజ్యోతి(14-06-2020)

ప్రశ్న: డాక్టర్‌! నాకు అంగస్తంభన సమస్య ఉంది. ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదిస్తే, రక్తనాళాలు పాడయ్యాయనీ, షాక్‌ థెరపీ పెట్టాలనీ అంటున్నారు. షాక్‌వేవ్‌ థెరపీతో అంగం మరింత పాడవుతుందా? మూత్రవిసర్జనకూ, సంతానానికీ ఇబ్బందులు ఎదురవుతాయా? తగిన సలహా ఇవ్వగలరు.


- ఓ సోదరుడు, కర్నూలు.


డాక్టర్ సమాధానం: మిమ్మల్ని వైద్యులు ఆన్‌లైన్‌లోనే పరీక్షించారు. కాబట్టి మీకున్న సమస్యను పూర్తిగా విశ్లేషించే అవకాశం ఉండదు. అంగ స్తంభన సమస్య టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ తగ్గుదల, మానసిక కారణాల వల్ల కూడా తలెత్తే వీలుంది. ఈ సమస్యలకు షాక్‌వేవ్‌ థెరపీ అవసరం లేదు. వీటిని కౌన్సెలింగ్‌, మందులతో సరిదిద్దే వీలుంది. మీ సమస్యకు మానసికమైన, హార్మోన్‌ సంబంధ కారణాలు కానప్పుడు మాత్రమే షాక్‌వేవ్‌ థెరపీ ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ప్రత్యక్షంగా పరీక్షించి, మాట్లాడిన తర్వాతే అంగస్తంభనకు అసలు కారణాన్ని కనిపెట్టవచ్చు. పినైల్‌ డాప్లర్‌ స్కానింగ్‌ సహాయంతో మీ సమస్యను నిర్థారించి, షాక్‌వేవ్‌ థెరపీ చికిత్సను వైద్యులు సూచిస్తారు. అయితే షాక్‌థెరపీతో మీరు అనుకుంటున్న ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. షాక్‌వేవ్‌ థెరపీ అనేది ఒక ఫిజియోథెరపీ లాంటిదే! దీనితో షాక్‌ తగలడం, నొప్పి లాంటి ఇబ్బందులు ఉండవు. పేరుకు షాక్‌వేవ్‌ థెరపీ అయినా, దాన్లో విద్యుదయస్కాంత తరంగాలే ఉంటాయి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఈ థెరపీ వారానికి ఒకసారి చొప్పున నాలుగుసార్లు చేయవలసి ఉంటుంది. కాబట్టి వైద్యులను ప్రత్యక్షంగా కలిసి, మీ సమస్యను నిర్థారించుకుని, దానికి తగిన చికిత్స తీసుకోండి.-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)


Read more