పర్ఫెక్ట్‌ ఇంజనీర్‌.. ఇవి అవసరం!

ABN , First Publish Date - 2020-10-12T17:07:14+05:30 IST

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతితోనే ఆధునిక ప్రపంచం సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇప్పటి సైంటిఫిక్‌ అద్భుతాల్లో కూడా అతి పెద్ద వాటా ఇంజనీరింగ్‌ రంగానికే చెందుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్‌ ఎంతో విస్తృతిని సంతరించుకుంది.

పర్ఫెక్ట్‌ ఇంజనీర్‌.. ఇవి అవసరం!

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతితోనే ఆధునిక ప్రపంచం సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇప్పటి సైంటిఫిక్‌ అద్భుతాల్లో కూడా అతి పెద్ద వాటా ఇంజనీరింగ్‌ రంగానికే చెందుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్‌ ఎంతో విస్తృతిని సంతరించుకుంది. థర్మల్‌ ఇంజనీరింగ్‌, అల్ట్రాసోనిక్స్‌, వాక్యూమ్‌ టెక్నాలజీ, పాలిమర్‌ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్‌, కంప్యూటర్స్‌గా శాఖోపశాఖలతో విస్తరించింది. 


సైన్స్‌తో పోల్చుకుంటే భిన్నం. ప్రకృతిని శాస్త్రవేత్తలు అవగాహన చేసుకుంటారు. ప్రకృతిలో ఇమిడిపోకుండా శాస్త్రవేత్తలు కొత్త వాటిని కనుగొనేందుకు యత్నిస్తారు. నిర్దుష్టమైన డిజైన్‌ రూపొందించుకుంటారు. తద్వారా ప్రజలకు ఉపకరించే వాటిని ఉత్పత్తి చేస్తారు. ప్రజలు, క్లయింట్లు, యజమానులకు జవాబుదారీగా ఇంజనీర్లు ఉండాలి. అన్నింటికీ మించి వివిధ ఇంజనీరింగ్‌ సొసైటీలు ప్రబోధించే నైతిక ధర్మాలు, విలువలూ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ ఉంటాయి.  డిసిప్లిన్‌  సబ్జెక్టుకుతోడు మేథ్స్‌, ఫిజికల్‌, లైఫ్‌ సైన్సెస్‌ అధ్యయనం చాలా వరకు ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌ల్లో ఉంటుంది. అలాగే చాలా ప్రోగ్రామ్‌ల్లో జనరల్‌ ఇంజనీరింగ్‌, అప్లయిడ్‌ అకౌంటింగ్‌ను కూడా కలుపుతున్నారు. డిజైనింగ్‌, అవసరమైన మేర కంప్యూటర్స్‌, లేబ్‌, క్లాస్‌ రూమ్‌ ప్రోగ్రామ్‌గా కరికులమ్‌ ఉంటుంది. 


విజయానికి కీలకం ఆప్టిట్యూడ్‌ కాదు, యాటిట్యూడ్‌ మాత్రమే. అదే మీ ఆల్టిట్యూడ్‌ని నిర్దేశిస్తుంది. అంటే తెలుసుకోవాలన్న ఆకాంక్ష కంటే అందుకు కనబరిచే సంసిద్ధత లేదా వైఖరి మాత్రమే ఒక వ్యక్తి ఎదుగుదలను నిర్దేశిస్తుందని పేర్కొనవచ్చు. అయితే ఇప్పటి గ్రాడ్యుయేట్లు వస్తూనే ఎదుగుదల తమ హక్కు అని భావిస్తున్నారని పలువురు ఎంప్లాయిర్లు చెబుతున్నారు. అది మంచి దృక్పథమే. భిన్న సంస్కృతులు, ఆలోచన ధోరణితో ఉండే వ్యక్తులు ఒక్క ఆప్టిట్యూడ్‌తో నెగ్గుకురాలేరు. ‘విన్నింగ్‌ ఈజ్‌ ఎవ్రిథింగ్‌’ (గెలుపే సర్వస్వం) అన్న సంస్కృతి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆప్టిట్యూడ్‌, యాటిట్యూడ్‌ కల గలిస్తేనే ఎదుగుదల సాధ్యం.


ఇంజనీరింగ్‌ విద్యలో సరికొత్త ధోరణలు ఈ శతాబ్దిలో కనిపిస్తున్నాయి. సబ్జెక్టు కంటే ఇంజనీర్‌గా ఒక వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడన్న విషయం మీదే దృష్టిసారిస్తోంది. ఇంజనీరింగ్‌ నైపుణ్యాలే ప్రధాన ప్రాతిపదిక. సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి ఆలోచన విధానాన్ని అవలంబిస్తున్నారు అనేదాన్ని బట్టే ఇంజనీర్లను అంచనా వేస్తున్నట్టు ‘క్వాలిటీ అస్యూరెన్స్‌ ఏజెన్సీ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ పేర్కొంది. 


ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికత అవతరిస్తున్న నేపథ్యంలో ఇంజనీరింగ్‌ ప్రొఫెషన్‌ సవాళ్ళతో కూడుకున్నదిగా మారింది. మేథ్స్‌, ఫిజిక్స్‌లో పట్టు ఉన్న విద్యార్థులు మాత్రమే ఇంజనీరింగ్‌లో రాణిస్తారని అటు తల్లిదండ్రులు, ఇటు విద్యావేత్తలు భావిస్తున్నారు. అయితే ఆ రెంటిలో పట్టు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువమంది పెద్దగా విజయం సాధించలేకపోతున్నారు. ఐటి తదితర రంగాలు విపరీతంగా అభివృద్ధి  చెందిన తరవాత  కెరీర్‌పరంగా గౌరవం, హోదా, సానుకూల దృక్పథం, సగటు వేతనం కంటే ఎక్కువపొందే అవకాశం లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్‌ పాపులర్‌గా మారింది. సవాళ్ళను స్వీకరించే తత్వం, సరికొత్తదనంపై ఆసక్తి ఉంటే చేసేందుకు పలు ఇంజనీరింగ్‌ డిసిప్లిన్‌లు ఉన్నాయి. వాటినుంచి నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు. ఇంజనీర్‌గా కెరీర్‌ కొనసాగించాలంటే అందుకుతగ్గ చదువు, శిక్షణ తప్పనిసరి. ఇంజనీర్‌గా కెరీర్‌లో ఎదుగుదల బాగా ఉండాలంటే బ్యాచిలర్‌ డిగ్రీ అవసరం. అయితే అసోసియేట్స్‌ డిగ్రీ, సర్టిఫికేషన్‌తో కూడా ఉపాధి పొందవచ్చనుకోండి. సంప్రదాయ డిగ్రీ పొందితే అందుకు తగ్గ అనుభవం కూడా లభిస్తుంది.


లక్షణాలు

విశ్లేషణ సామర్థ్యం: ఇంజనీర్‌ కావాలనుకునే వ్యక్తికి పటిష్టమైన విశ్లేషణ నైపుణ్యాలు అవసరం. వస్తువులను నిరంతరం పరిశీలించి, వాటితో బాగా ఎలా పనిచేయించగలం అన్నది చూడగలగాలి. 


వివరాలు పరిశీలించాలి:  ఇంజనీర్‌కు వివరాలు లోతుగా తెలుసుకొనేతత్వం ఉండాలి. చిన్నపాటి పొరపాటు కూడా మొత్తం నిర్మాణాన్ని దెబ్బ తీయవచ్చు. ఒక ప్రాజెక్టు నిర్వహణ నుంచి పూర్తి వరకు ప్రతి స్థాయిలో చాలా చిన్నవాటిని కూడా లోతుగా చూసుకుంటూ ఉండాలి. 


కమ్యూనికేషన్‌ స్కిల్స్‌: ఇంజనీర్‌కు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. సంక్లిష్టంగా ఉండే సాంకేతిక విషయాలను సరళంగా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. అటు క్లయింట్లకు, ఇటు సహోద్యోగులకు సులువుగా అర్థం అయ్యేలా తెలియజేయగలగాలి.


కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌: ఇంజనీర్‌ అంటే నిరంతర పరిశోధకుడు. ఏ పరిశ్రమలోనైనా ఇంజనీర్‌ స్థానం ఉన్నతంగా ఉంటుంది. త్వరత్వరగా మారే సాంకేతికతను ఇంజనీర్‌ అధ్యయనం చేస్తూ ఉండాలి. అందుకే ఇంజనీర్‌ నిరంతర విద్యార్థి.


సృజనాత్మకత: ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం తాపత్రయపడాలి. సృజనాత్మకత చాలా అవసరం. సరికొత్త సిస్టమ్స్‌ని డెవలప్‌ చేయగలగాలి. ఉన్నవాటితో సమర్థంగా పనిచేయించగలగాలి.


తార్కికత: తార్కికంగా ఆలోచించే సామర్థ్యం చాలా అవసరం. ఈ విషయంలో చాలా ఉన్నత స్థాయిలో ఉండాలి. సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకోవడమే కాకుండా ఏవి ఎలా పనిచేస్తాయి, ఎలాంటి సమస్యలు తలెత్తుతాయన్న  విషయమై అవగాహన ఉండాలి. 


మేథమెటికల్‌ నైపుణ్యం: అత్యున్నత స్థాయిలో మేథ్స్‌ నైపుణ్యాలు చాలా అవసరం. వివిధ సాంకేతిక అంశాలతో కూడిన ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో సంక్లిష్టమైన కాలిక్యులేషన్స్‌ కూడా ఉంటాయి. 


ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు: సమస్య తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించే నైపుణ్యాలు కూడా చాలా అవసరం. వృత్తిపరంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. 


టీమ్‌ ప్లేయర్‌: సమష్టి పనిలో అందరూ సభ్యులే అన్న అవగాహన ఇంజనీర్‌కు చాలా అవసరం.  ఒక పనిని అందరూ కలసికట్టుగా చేయాలన్న తపన ఉండాలి. 


సాంకేతిక పరిజ్ఞానం: ఇంజనీర్‌కు ఇది చాలా అవసరం. వివిధ కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను, ఇతర వ్యవస్థలను అర్థం చేసుకోగలగాలి. ఏ ప్రాజెక్టులోనైనా సాంకేతిక పరిజ్ఞానం తప్పని సరిగా ఉంటుంది.

Updated Date - 2020-10-12T17:07:14+05:30 IST