ఆమె ఒక శిఖరం

ABN , First Publish Date - 2020-12-10T20:56:45+05:30 IST

వారసత్వంగా వచ్చిన హోదాను నిలబెట్టుకోవాలంటే అందుకు తగిన సామర్థ్యం ఉండాలి. అదీ హెచ్‌సీఎల్‌ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థల పగ్గాలు చేపట్టాలంటే..! సామర్థ్యంతో పాటు సాహసమూ

ఆమె ఒక శిఖరం

వారసత్వంగా వచ్చిన హోదాను నిలబెట్టుకోవాలంటే అందుకు తగిన సామర్థ్యం ఉండాలి. అదీ హెచ్‌సీఎల్‌ వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థల పగ్గాలు చేపట్టాలంటే..! సామర్థ్యంతో పాటు సాహసమూ కావాలి. ఆ రెండూ కలగలిపిన మహిళ రోషిణీ నాడార్‌. తండ్రికి తగ్గ తనయగా... హెచ్‌సీఎల్‌ చైర్‌పర్సన్‌గా... సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె తాజాగా ‘ఫోర్బ్స్‌’ మ్యాగజైన్‌ 100 మంది శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. తనను తాను నిరూపించకొని... తనలాంటి వారినెందరినో తయారు చేస్తున్న రోషిణీ విజయ ప్రస్థానం ఇది...


రోషిణీ నాడార్‌... పరిచయం అక్కర్లేని పేరు. ‘హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌’ (హెచ్‌సీఎల్‌) వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ ఏకైక కుమార్తె. అంత పెద్ద సంస్థకు ఒకే ఒక్క వారసురాలు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె బాల్యం అంతా ఆ మహానగరంలోనే గడిచింది. వసంత్‌ వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం... తరువాత అమెరికా వెళ్లి, అక్కడి ‘నార్త్‌వెస్ట్రన్‌ యూనివర్సిటీ’లో డిగ్రీ పూర్తి చేశారు. తొలుత అర్ధశాస్త్రంలో డిగ్రీ చేద్దామనుకున్నారు. అయితే మనసు మార్చుకుని రేడియో, టీవీ, ఫిలిమ్‌ సబ్జెక్టులుగా కమ్యూనికేషన్స్‌లో పట్టభద్రులయ్యారు. 


ఎన్నో ఉద్యోగాల తరువాత... 

తండ్రిది తిరుగులేని వ్యాపార సామ్రాజ్యం... కాలు కింద పెట్టకుండా ఆస్వాదించగల జీవితం... అన్నీ ఉన్నా ఆమె ఒక సాధారణ అమ్మాయిలా కష్టపడ్డారు. తనను తాను నిరూపించుకోవాలన్న సంకల్పంతో చదువు అయిపోగానే రకరకాల ఉద్యోగాలు చేశారు. రెండేళ్లు లండన్‌ ‘స్కైన్యూస్‌’లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. కొంతకాల ‘సీఎన్‌ఎన్‌’లో కూడా పని చేశారు. షికాగో వెళ్లి ‘కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. భారత్‌ వచ్చాక సాధారణ ఉద్యోగిలా హెచ్‌సీఎల్‌లో చేరారు. కొంత అనుభవం గడించాక సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. సాంకేతిక అంశాలతో ముడిపడిన సంస్థ హెచ్‌సీఎల్‌. కానీ రోషిణీకి ఆ నేపథ్యం లేదు. అయినా ఆ లోటును ఆమె  ఎక్కడా కనిపించనివ్వలేదు.


‘‘ఏ సంస్థను నడిపించాలన్నా ముందు ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉండాలి. అన్ని విభాగాలను నిర్వహించేవారి సామర్థ్యాన్ని అంచనా వేయగలగాలి. అప్పుడు ఏ కంపెనీనైనా నడపవచ్చు’’ అంటారు రోషిణీ. కొద్ది కాలంలోనే కంపెనీ సీఈఓగా ఎదిగారు. 2017లో శివ్‌ నాడార్‌ హెచ్‌సీఎల్‌ చైర్మన్‌గా తప్పుకొని ఆ బాధ్యతలను తన గారాల కూతురు రోషిణీకి అప్పగించారు. తద్వారా భారత్‌లో లిస్ట్‌ అయిన ఒక ఐటీ కంపెనీకి సారథ్యం వహిస్తున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు రోషిణీ. 


వేగంగా పురోగతి... 

రోషిణీ బాధ్యతలు చేపట్టాక సంస్థ పురోగతిలో వేగం పెరిగింది. ఆమె ఆలోచనలతోనే ‘హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్‌’ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంది. ‘హెచ్‌సీఎల్‌ ట్యాలెంట్‌ కేర్‌’ను బలోపేతం చేసింది. ‘ఐడియా ప్రెన్యూర్‌షిప్‌’ కింద ఉద్యోగుల నుంచి సేకరించిన ఉత్తమ వ్యాపార ఆలోచనలకు రూపం ఇచ్చే కార్యక్రమాన్ని ఆమె ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమం కింద 2014 నాటికి సంస్థ ఉద్యోగులు చేసిన ఆలోచనల విలువ 500 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.   


మహిళా సాధికారత కోసం... 

ప్రపంచం అభివృద్ధి పథంలో పరుగులెడుతున్నా మహిళలకు అన్ని చోట్లా సమాన అవకాశాలు రావడంలేదు. దానికి కారణాలు అనేకం. ఈ తీరులో మార్పు తేవాలనుకున్నారు రోషిణీ. ‘‘భారత పరిశ్రమల్లో ఉన్న మహిళా ఉద్యోగులు 27 శాతమే. వీళ్లలో అధికులు ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోయారు. కంపెనీలు నడిపించే స్థాయికి చేరలేదు. మా సంస్థనే తీసుకొంటే... లక్షన్నరకు పైగా ఉద్యోగులు ఉన్నారు. టాప్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌లో 200 మంది ఉన్నారు. కానీ వీరిలో ఒక్క మహిళ కూడా లేరు’’... ఒకానొక సందర్భంలో రోషిణీ ఆవేదన ఇది. అందుకే తమ సంస్థలోని మహిళా ఉద్యోగుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా నిపుణులతో శిక్షణ ఇప్పించారు. 


సామాజిక సేవ... 

ఒక పక్క హెచ్‌సీఎల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు రోషిణీ. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ‘శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌’కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ‘నాడార్‌ విద్యాజ్ఞాన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రతిభావంతులైన పేద విద్యార్థులను గుర్తించి, చదివిస్తున్నారు. ఇవికాకుండా... తమ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకొంటున్న ఆమె 2010లో శిఖర్‌ మల్హోత్రాను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ వైస్‌చైర్మన్‌. వీరికి ఇద్దరు సంతానం. శాస్త్రీయ సంగీతంలో రోషిణీకి ప్రవేశం ఉంది. 


ఆ జాబితాలో నాలుగేళ్లుగా... 

తాజాగా ‘ఫోర్బ్స్‌’ మేగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో రోషిణీ నాడార్‌ స్థానం సంపాదించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఆమెకు వరుసగా నాలుగో ఏడాది. అంతేకాదు... ‘హరూన్‌ రిచ్‌ లిస్ట్‌’ ఇటీవల ప్రకటించిన జాబితాలో భారత్‌లోనే సంపన్న మహిళా పారిశ్రామికవేత్తగా తొలి స్థానంలో నిలిచారు. ఇవే కాకుండా ఎన్నో అవార్డులు, గౌరవ పురస్కారాలు ఆమె ప్రతిభకు పట్టం కట్టాయి.


‘‘పారిశ్రామికవేత్తగా విజయం సాధించాలంటే ఉండాల్సిన ప్రధాన లక్షణం... రిస్క్‌ తీసుకోగలగడం. అది ఆలోచనా విధానంలో కావచ్చు... ఉద్యోగుల విషయంలో కావచ్చు. అదే మనల్ని ఏ స్థాయిలో నిలబెట్టాలనేది నిర్ణయిస్తుంది’’... ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రోషిణీ ఇచ్చే సందేశం. ‘‘ఎదుటివారిలోని ప్రతిభను బయటకు తీయగలిగినవారే ఉత్తమ నాయకులు’’ అంటున్న ఆమె ప్రయాణం... మిగతా కార్పొరేట్‌ వారసుల కన్నా భిన్నం. Updated Date - 2020-12-10T20:56:45+05:30 IST